Kharif Crop: ఖరీఫ్‌కు రెడీ | Sakshi
Sakshi News home page

Kharif Crop: ఖరీఫ్‌కు రెడీ

Published Wed, May 26 2021 5:44 AM

AP Govt plans to release water to kharif crops - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌ పంటలకు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి డెల్టాకు జూన్‌ 15న నీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్‌ పనులు పూర్తవడం ఆధారంగా రెం డు మూడ్రోజుల ముందే అంటే జూన్‌ 12నే గోదా వరి డెల్టాకు నీటి విడుదల చేసే అవకాశాలను పరి శీలిస్తున్నట్లు ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే జలాలు, కృష్ణా వరద ప్రవాహాల ఆధారంగా కృష్ణా డెల్టా, వంశధారలో ప్రవాహాల ఆధారంగా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద, నీటి లభ్యతను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని నీటిని విడుదల చేయనున్నారు. 

రెండేళ్లుగా కళకళ..
భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, చిన్న నీటివనరుల విభాగం కింద రాష్ట్రంలో 1.33 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ పంటల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.  అదే తరహాలో ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టి సమర్థవంతంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది. 

స్పిల్‌ వే మీదుగా వరద మళ్లింపు..
పోలవరం స్పిల్‌ వే మీదుగా గోదావరి వరద మళ్లింపు పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, స్పిల్‌ వే పనులు పూర్తవుతూనే వరదను పోలవరం స్పిల్‌ వే మీదుగానే దిగువకు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవుతూనే గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 11.70 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరి వరద మట్టం 14 మీటర్లు దాటాక  పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించడాన్ని ప్రారంభిస్తారు.

పులిచింతల్లోకి వచ్చే వరద, ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటలకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. వంశధారలో వరద ప్రవాహం ప్రారంభం  కాగానే గొట్టా బ్యారేజీ కుడి కాలువ ద్వారా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. నాగావళిలో వరద ప్రవాహం ఆధారంగా తోటపల్లి బ్యారేజీ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. 

శివారు భూములకూ నీళ్లందేలా..
గత రెండేళ్ల తరహాలోనే ఆయకట్టు చివరి భూములకూ సమర్థంగా నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాలువలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 807 మరమ్మతుల పనులను కడా(ఆయకట్టు ప్రాంత అభివృద్ది సంస్థ) నేతృత్వంలో రూ.104.21 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను జూన్‌ 15లోగా పూర్తి చేయాలని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు డెడ్‌లైన్‌ విధించారు. కాలువలోకి నీటిని విడుదల చేసేలోగా మరమ్మతు పనులు పూర్తయితే నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందన్నది అధికారుల ఉద్దేశం. తద్వారా ఆయకట్టు చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించనున్నారు. 

Advertisement
Advertisement