పాపికొండలకు చలోచలో

Ap Govt Has Resumed The Papikondalu Boating Godavari River - Sakshi

విహార యాత్రను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్న మంత్రి

నిరంతర పర్యవేక్షణతో పాటు ఎస్కార్ట్‌ బోట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడి

రాజమహేంద్రవరంలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ప్రారంభం

రంపచోడవరం: గోదావరి నదీ జలాల్లో పాపికొండల విహార యాత్రను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 114 మంది పర్యాటకులతో రెండు బోట్లు ఆదివారం పాపికొండల విహారానికి వెళ్లాయి. ఈ యాత్రను తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్‌ పాయింట్‌ వద్ద పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. లైఫ్‌ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని పర్యాటకులకు సూచించారు.

పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు 9 కమాండ్‌ కంట్రోల్‌ రూముల పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పర్యాటక శాఖల అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని విహార యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. శాటిలైట్‌ సిస్టమ్‌ ద్వారా బోట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పర్యాటకుల బోట్లు బయలుదేరడానికి ముందు ఎస్కార్ట్‌ బోటు వెళ్తుందని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. వెనుక వచ్చే పర్యాటక బోట్లకు సమాచారమిస్తారని తెలిపారు. ఏపీ టూరిజం వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని, దీనివల్ల పర్యాటక బోట్లలో ఎంతమంది వెళ్తున్నారనే లెక్క పక్కాగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 11 బోట్లకు అనుమతులిచ్చామని, వీటిలో ఏపీ టూరిజం బోట్లు 2, ప్రైవేట్‌ బోట్లు 9 ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్, ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

గోదావరిపై ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో గోదావరి జలాలపై తేలియాడేలా తీర్చిదిద్దిన ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. రెండు స్టీల్‌ పంటులపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌లో 95 మంది ప్రయాణించవచ్చు. ఈ రెస్టారెంట్‌కు పద్మావతి ఘాట్‌ నుంచి వెళ్లవచ్చు. 15 రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. వివాహ విందులు, పుట్టిన రోజు, కిట్టీ పార్టీల వంటివి నిర్వహించుకునేందుకు వీలుగా దీనిని అధికారులు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top