అతిథి గృహంపై జోక్యం తగదు

AP Government reported to High Court Visakha Guest house construction - Sakshi

అది స్వతంత్ర నిర్ణయం.. రాజధాని అంశంతో సంబంధం లేనిది

ప్రభుత్వ నిర్ణయాలను పిటిషనర్లు సూక్ష్మస్థాయిలో ప్రశ్నించజాలరు

ప్రవర్తనా నియమావళిని నిర్దేశించలేరు

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: విశాఖలో నిర్మించ తలపెట్టిన అతిథి గృహానికి రాజధానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అది స్వతంత్ర నిర్ణయమని, అతిథి గృహ నిర్మాణంపై గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టును అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వాలని కోరారు. అతిథి గృహం స్వరూపం, విస్తీర్ణం, గదుల సంఖ్య, ప్లాన్‌ తదితర విషయాల్లో జోక్యం చేసుకునే పరిధి అధికరణ 226 కింద హైకోర్టుకు లేదని నివేదించారు. ప్రభుత్వ నిర్ణయాలను సూక్ష్మస్థాయిలో ప్రశ్నించే అధికారం, హక్కు పిటిషనర్లకు లేదని స్పష్టం చేశారు. పిటిషనర్లు ప్రభుత్వానికి ప్రవర్తనా నియమావళిని నిర్దేశించజాలరన్నారు. తిరుపతి, కాకినాడల్లో నిర్మిస్తున్న అతిథి గృహాలను విశాఖతో పోల్చి చూడడానికి వీల్లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అతిథి గృహం నిర్మాణంపై దాఖలైన అనుబంధ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ అంశంపై ఉత్తర్వులను రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ విచారణను వాయిదా వేసింది. 

ప్రతివాదుల జాబితా నుంచి సీఎం తదితరుల తొలగింపు... 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై శాసన మండలిలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజీలను సీల్డ్‌ కవర్‌లో అందచేయాలని శాసనసభ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాల్లో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.  

2 నుంచి రోజువారీ విచారణ.. 
దసరా సెలవుల నేపథ్యంలో రాజధాని అంశంలో దాఖలైన వ్యాజ్యాలపై నవంబర్‌ 2 నుంచి హైబ్రీడ్‌ విధానంలో రోజువారీ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. ఇరుపక్షాలకు ఏడు రోజుల సమయం మాత్రమే ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించినందున ఆ అనుబంధ పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికే స్టేటస్‌ కో ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో మళ్లీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అనంతరం అన్ని వ్యాజ్యాలపై విచారణను నవంబర్‌ 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top