విజయవాడ: రాష్ట్రంలో కూటమి సర్కార్ మరో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను, ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేటు సంస్థలు అమ్ముకునేందుకు, బదిలీ లేదా లీజుకు ఇచ్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2012 ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ (భూ కేటాయింపుల విధానం) నిబంధనలను పక్కన పెడుతూ ఈ కొత్త ఉత్తర్వులను తీసుకురావడం గమనార్హం.
అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్న టూరిజం ప్రాజెక్టుల భూములను ప్రైవేటు డెవలపర్లు అమ్ముకోవడానికి, బదిలీ చేయడానికి లేదా లీజుకు ఇచ్చుకోవడానికి వీలుగా సర్కార్ జీవో ఇచ్చింది. సాధారణంగా భూముల బదిలీ సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, బకాయిలు చెల్లించకపోయినా ఈ విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించారు.
వివాదాస్పద లేదా నిషేధిత జాబితాలో (22A) ఉన్న భూములను సైతం విక్రయించడానికి, బదిలీ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. తాజా ఉత్తర్వుల వల్ల ఉచితంగా ప్రైవేటు డెవలపర్ల చేతుల్లోకి మారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎటువంటి కఠిన నిబంధనలు లేకుండా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సైతం వదులుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
అధికార టీడీపీ నేతలకు భారీ ల్యాండ్ స్కామ్ ద్వారా లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు శక్తులకుధారాదత్తం చేయడానికే 2012 నాటి పాలసీకి తూట్లు పొడిచారని మండిపడుతున్నారు. వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల పరం చేసే ఈ ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


