కాలనీల్లో సదుపాయాలు కల్పించండి

AP Finance Minister Buggana Rajendranath appeals Niti Aayog CEO - Sakshi

నీతి ఆయోగ్‌కు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తి

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం ప్రకారం తగిన కోటా రేషన్‌ ఇవ్వాలి

కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్‌కు వినతి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణం వల్ల ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని నీతి ఆయోగ్‌కు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. ఆయన బుధవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనాలతో కలిసి న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌గోయెల్‌తో భేటీ అయ్యారు.

అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు నీటిపారుదల ప్రాజెక్టులను నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సిఫార్సు చేయాలని కోరినట్లు చెప్పారు.

ఈ అంశాన్ని అభినందించిన నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్, సీఈవోలు స్వాగతించదగినదిగా పేర్కొన్నారన్నారు. రాష్ట్రంపై పూర్తిభారం పడకుండా కేంద్రం సహకరించాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రేషన్‌వాటా తగ్గిన విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 2015 నుంచే వాటా తగ్గుతూ వస్తోందని, గత ప్రభుత్వం గమనించపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వాటా తగ్గడం వల్ల సుమారు 35 వేల టన్నుల బియ్యం తగ్గుతున్నాయని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.వందల కోట్ల భారం పడుతోందని చెప్పారు.

ఈ అంశాన్ని వివరిస్తూ గ్రామీణ ప్రాంతాలకు 75 శాతానికిగాను 60 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతానికిగాను 40 శాతం వాటా వస్తున్నట్లు తెలిపామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పదిశాతం ఎక్కువ వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా దీనిపై దృష్టిసారించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారని చెప్పారు. రబీ సేకరణ, గరీబ్‌ కల్యాణ్‌ యోజన బకాయిలు త్వరగా విడుదల చేయాలని కోరినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top