Ap Budget: నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల కేటాయింపులు

Ap Budget 2023 24: 11908 Crore Allocation For Water Resources - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమమే తమ ధ్యేయమంటూ జన రంజక బడ్జెట్‌ ప్రవేశపెట్టి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ నీటి వనరుల అభివృద్ధికీ ప్రాధాన్యమిచ్చింది. ఏపీ వార్షిక బడ్జెట్‌ 2023-24 ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు దిశగా చేస్తున్న కృషిని వెల్లడించారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి  సీఎం జగన్‌ పెన్నా నదిపై పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి రానుండటంతో ప్రజల చిర కాలస్వప్నం నెరవేరనున్నది. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట, కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి. పునర్నిర్మాణ, పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం కింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అను సంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశలోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

నల్లమల సాగర్‌ నీరందించేందుకుగాను పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్  మొదటి దశ, రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాంమని, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశను మార్చి 2025 నాటికి, రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన తెలిపారు.

పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022న కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేశాం. జూలై 31, 2022న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని మంత్రి అన్నారు.

► 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top