
ఇటు కుంభవృష్టి, అటు కటిక కరువు
అధిక ఉష్ణోగ్రత, అతివృష్టి, అనావృష్టి
2024లో ప్రపంచం అతలాకుతలం
ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది. ఇటు కుంభవృష్టి, అటు కరువులు విరుచుకుపడటంతో మూడింట రెండొంతుల నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి లేదా విపరీతమైన వరదలతో సతమతమయ్యాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల వల్ల ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో తీవ్రస్థాయిలో కష్టాలపాలయ్యారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదికలో వెల్లడించింది. – సాక్షి, సాగుబడి
అసాధారణ నీటి కష్టాల వల్ల.. ఆహార కొరత, ధరల పెరుగుదల, సంఘర్షణలు, వలసలు పెరిగాయని 41 దేశాల సమాచారాన్ని క్రోడీకరించిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదిక వివరించింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూఎంఓ ఏటా ప్రపంచ జల వనరులపై నివేదికను వెలువరిస్తుంటుంది. నీటి వనరులపై ప్రజలు, పాలకులు, శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేస్తుంది.
కరువు కరాళ నృత్యం
అతి తీవ్రమైన నీటి సమస్యలతో ప్రపంచ జల చక్రం పూర్తిగా గతి తప్పింది. నదులు, రిజర్వాయర్లు, సరస్సులు, భూగర్భ జలాలు, హిమానీ నదాలన్నిటిలోనూ ఈ అసాధారణ స్థితిగతులు కనిపించాయి. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో వరదలు పొటెత్తగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో తీవ్ర కరువు కరాళ నృత్యం చేసింది.
హిమానీ నదాల్లో మంచు నిల్వలు 450 గిగా టన్నుల (ఒక గిగా టన్ను అంటే లక్ష కోట్ల కిలోలు) మేరకు అత్యధికంగా కరగటం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఆకస్మిక వరదలతో పాటు దీర్ఘకాలిక నీటి అభద్రతకు ఇది దారితీస్తుంది. ఈ నీటితో 1.2 మిల్లీమీటర్ల మేరకు సముద్రాల నీటి మట్టాలు పెరిగాయి.
వరుసగా ఆరో ఏడాది
నీటి చక్రం అస్తవ్యస్తం కావటం ఇదే మొదటిసారి కాదు. ఇలా జరగడం వరుసగా ఆరో ఏడాది. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ప్రభుత్వాలకు వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగింది. పంట దిగుబడులు నష్టపోయారు. ధరలు పెరిగిపోయాయి. ఆహార కొరత పెరిగింది. ఉద్రిక్తతలు పెరిగాయి.
పొట్ట కూటికోసం వలస పోవాల్సిన దుస్థితి మరింతగా పెరిగింది. గత ఏడాది 40 శాతం నదుల్లో మాత్రమే.. నీటి లభ్యత ఉండాల్సినంత సాధారణంగా ఉంది. మిగతా 60 శాతం నదుల్లో అతి కరువు లేదా అతి వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు తీవ్ర పరిస్థితులు నెలకొన్న విచిత్ర స్థితి ఏర్పడింది.
మనదేశంలోనూ..
ఉత్తర భారతంలో అతివృష్టి కారణంగా భూగర్భ జలాల్లో 2023తో పోల్చితే వృద్ధి కనిపించింది. అయితే, వాయవ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కరువు నెలకొంది. భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రిజర్వాయర్లలోకి చాలా ఎక్కువ నీరు చేరింది. గంగ, గోదావరి, కృష్ణా తదితర నదులు సాధారణం కన్నా ఎక్కువగా ఉప్పొంగాయి. జూలై 30న కేరళలో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఇందులో 385 మంది భారతీయులు చనిపోయారు.
40 లక్షల మంది నిరాశ్రయులు
అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. దక్షిణ అమెరికాలో, ముఖ్యంగా అమెజాన్ బేసిన్లలో మట్టిలో తేమ బాగా తగ్గింది. సెంట్రల్ యూరప్‌లో అందుకు భిన్నంగా నేలలు అతి తేమగా మారాయి.
» సెంట్రల్ యూరప్, రష్యా, పాకిస్తాన్‌లలో పెను వరదలు ముంచెత్తాయి.
» ఆఫ్రికా ట్రాపికల్ జోన్‌లో వరదలకు 2,500 మంది చనిపోగా, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
» దుబాయ్‌లో 75 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత వర్షపాతం నమోదైంది.
అస్తవ్యస్తం జలచక్రం
నీరే జీవకోటికి ప్రాణాధారం. ఆర్థిక వ్యవస్థలకు నీరే ఇంధనం. పర్యావరణానికీ నీరే ప్రాణం. అయితే, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జలచక్రం అస్తవ్యస్తమైంది. జలవనరులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడికి గురై విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రాణాధారమైన ఆ నీరే ఉపద్రవాలకు కారణమై ప్రజల ప్రాణాలను, ఆస్తులను, జీవనోపాధులను కబళిస్తోంది.
ఇది మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. జలచక్రం ఎంత అస్తవ్యస్తంగా మారిపోయిందో 2024 నివేదిక మనకు తెలియజñ ప్తోంది. దీనిపై మరింత శ్రద్ధగా గణాంకాలు సేకరించాలి. జరుగుతున్నదేమిటో సరిగ్గా అంచనా వెయ్యలేకపోతే దాన్ని మార్చలేం కదా! – సెలెస్టె సాలో, ప్రధాన కార్యదర్శి, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)