ఈసారీ లాంచీలు లేనట్టేనా!

Antarvedi Boat Launches May Not Start This Year West Godavari District - Sakshi

కళ తప్పుతున్న అంతర్వేది ఉత్సవాలు.. లాంచీలు రప్పించే ప్రయత్నం చేయని అధికారులు

నరసాపురం (పశ్చిమ గోదావరి): అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 8 నుంచి తిరునాళ్లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే గత పదేళ్లుగా అంతర్వేదికి లాంచీలు నిలిచిపోవడంతో జిల్లా వాసులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఈ ఏడాది కూడా లాంచీలు రప్పించడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. నరసాపురం ప్రాంతంలో ప్రకృతి అందాలకు కొదవ లేదు.

వశిష్ట గోదావరి అందాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. అంతర్వేదికి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సౌలభ్యం ఉన్నా.. ప్రతీ ఏటా లాంచీల ద్వారా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చేది. నరసాపురం లాంచీల రేవు నుంచి అంతర్వేది క్షేత్రానికి వెళ్లడానికి గోదావరిలో సుమారు 45 నిమిషాలు ప్రయాణం చేయాలి. నరసాపురం రేవు నుంచి అంతర్వేది రేవు పది కిలోమీటర్లు దూరంలో  ఉంది. 2011 నుంచి లాంచీల ప్రయాణాన్ని నిలుపుదల చేసారు. 

కొన్నేళ్ల క్రితం వరకు అంతర్వేది సమయంలో నరసాపురం నుంచి 150 పైగా లాంచీలు రాకపోకలు సాగించేవి. లాంచీ యజమానులు నష్టాలు వస్తున్నాయని తీసుకురామని చాలాసార్లు మొండికేశారు. స్థానిక అధికారులు చొరవ తీసుకుని లాంచీలు నడిపించేవారు. 2010లో అప్పటి సబ్‌కలెక్టర్‌ రొనాల్డ్‌రోజ్‌ పట్టుపట్టి లాంచీలు రప్పించారు. ఒకప్పుడు అంతర్వేది ఉత్సవాల హడావిడి మొత్తం నరసాపురంలోనే ఉండేది.

రాష్ట్రంలో ఏమూల నుంచి వచ్చే వారైనా, నరసాపురం వచ్చి లాంచీల్లో ప్రయాణించి అంతర్వేది చేరేవారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులూ ఇక్కడి యాత్రికుల రద్దీతో తీర్థం జరిగేది. నరసాపురం, పాలకొల్లు బస్టాండ్‌ ప్రాంతాలు కిటకిటలాడేవి. నరసాపురం గోదావరి రేవు దారి మొత్తం పుష్కరాల సమయాన్ని గుర్తు చేసేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. అంతర్వేది హడావిడి నరసాపురంలో ఒకప్పటిలా కనిపించడంలేదు. దీనికి తోడు లాంచీలు లేకపోవడంతో పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది.

అంతర్వేది శ్రీలక్ష్మీనర్శింహస్వామి ఆలయం

8 నుంచి ఉత్సవాలు
అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణ ఉత్సవాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. 17తో ముగుస్తాయి. 11న రాత్రి కల్యాణం, 12న రథోత్సవం, 16న పౌర్ణమి స్నానాలు ఉంటాయి. ఈ మూడురోజులు ఉత్సవాల్లో కీలకమైనవి. లాంచీలు లేకపోవడంతో బస్సుల్లో, పంటుపై గోదావరి దాటి వెళ్లాల్సిందే.

రెవెన్యూ శాఖ చొరవ చూపేది
లాంచీల్ని రప్పించడంలో గతంలో రెవిన్యూశాఖ చొరవ చూపేది. దీంతో లాంచీలు వచ్చేవి. లాంచీలో అంతర్వేది వెళుతున్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. వశిష్ట గోదావరి అందాలు పది కిలోమీటర్ల మేర చూస్తూ వెళ్లడం, ఆ ఆనందం చెప్పలేనిది. ఏడాదికోసారి లాంచీలో ప్రయాణించే అవకాశం వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది.  – విన్నా ప్రకాష్, న్యాయవాది

లాంచీలు తిప్పాలి
వశిష్ట గోదావరిపై ప్రకృతి అందాలకు కొదవలేదు. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయాల్లో లాంచీలు తిప్పితే ఉపయోగం ఉంటుంది. ఒకప్పుడు అంతర్వేది తిరునాళ్లు అంటే మొత్తం హడావిడి పట్టణంలోనే ఉండేది. ఆ రోజులు ఎంతో సరదాగా ఉండేవి. – సీహెచ్‌ రెడ్డప్ప ధవేజీ, సాహితీవేత్త

లాంచీల ఓనర్లు సంప్రదించలేదు
గతంలో అంతర్వేది తిరునాళ్లకు నరసాపురం నుంచి లాంచీలు తిరిగేవి. భద్రాచలం, కాకినాడ ప్రాంతాల నుంచి లాంచీల యజమానులు ముందుగానే రెవెన్యూ శాఖను సంప్రదించేవారు. కొన్నేళ్ల నుంచి లాంచీలు తిరగడంలేదు. ఈ ఏడాది మమ్మల్ని ఎవరూ సంప్రదించ లేదు. ప్రస్తుతం కరోనా ఉధృతి ఉంది. పై అధికారుల అనుమతితో ఏదైనా జరగాలి.       
– కందుల సత్యనారాయణ, ఇన్‌చార్జ్‌ తహసీల్దారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top