మరో ఫిషింగ్‌ హార్బర్‌  | Sakshi
Sakshi News home page

మరో ఫిషింగ్‌ హార్బర్‌ 

Published Thu, Aug 17 2023 3:46 AM

Another fishing harbor - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభు­త్వం తాజాగా 10వ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట వద్ద దీనిని ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్మించనుంది. రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతం 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 555 మత్స్యకార గ్రామాలకు చెందిన 6.3 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం రూ.3,520 కోట్లతో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో తొలి దశలో రూ.1,522.8 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచి­లీ­పట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నాలుగు హార్బర్లను వచ్చే డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రెండో దశలో రూ.1,997.77 కోట్లతో నిర్మిస్తున్న బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం,  బియ్యపుతిప్ప, వోడరేవు ఫిషింగ్‌ హార్బర్ల పనులు ఇటీవలే మొదలయ్యాయి. 

ఫిషింగ్‌ హార్బర్‌గా మార్పు 
2019 సెప్టెంబర్‌ 6న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంచినీళ్లపేటవద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు సీఎంను కలిసి ఇక్కడ కూడా ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు అక్కడ ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ మారిటైమ్‌ బోర్డును ఆదేశించారు. ఈ మేరకు పీఎం మత్స్య సంపద యోజన పథకం కింద మంచినీళ్లపేట వద్ద హార్బర్‌ నిర్మాణానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ ప్రతిపాదనను  పరిశీలించిన కేంద్రం సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. దీంతో డీపీఆర్‌ తయారీకి టెక్నికల్‌ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడం కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను పిలిచింది. ఆగస్టు 23 మధ్యాహ్నం మూడు గంటలలోపు ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని కోరింది.

మొత్తంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పది ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీటికి అదనంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేలటూరు వద్ద అదానీ గ్రూపు సుమారు రూ.25.84 కోట్లతో ఫిషింగ్‌ జెట్టీని నిర్మిస్తోంది. ఈ జెట్టీ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ 2022 అక్టోబర్‌ 27న భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ : చిన్న పడవలు, ఇంజిన్‌ బోట్లు నిలుపుకోవడానికి, చేపలు ఆరబెట్టుకునేందుకు అవకాశం. రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మాణం. 
ఫిషింగ్‌ హార్బర్‌ : పెద్ద బోట్లు నిలుపుకునేందుకు బెర్త్‌లు, జెట్టీల నిర్మాణం. చేపల స్టోరేజ్‌కు అవకాశం. నిర్మాణ ఖర్చు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ ఆగే బోట్లు సముద్రంలో చాలా దూరం వెళ్లగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే మినీ పోర్ట్‌. 

Advertisement
Advertisement