Horsley Hills: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్‌

Annamayya District: Horsley Hills Income Recovered After Covid Crisis - Sakshi

12 నెలల్లో రూ.4.02 కోట్ల ఆదాయం

కోవిడ్‌ కష్టాలు అధిగమిస్తూ ముందుకు

ఇంకా పెంచుకునేలా మార్గాల అన్వేషణ

బి.కొత్తకోట:  అన్నమయ్య జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో వేసవి విడిది కేంద్రంగా, ఆంధ్రా ఊటీగా విరాజిల్లుతున్న హార్సిలీహిల్స్‌పై కోవిడ్‌ ప్రభావం ఆర్థికంగా దెబ్బతీసింది. సందర్శకులు కరువై ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కోవిడ్‌ అనంతర పరిస్థితులతో పర్యాటకం గాడిలో పడటంతో సందర్శకుల రాకతో పాటు, వారిని ఆకట్టుకునే చర్యలు సఫలమై ఆదాయం పెరుగుతోంది.  

2000 ఏడాదిలో కొండపై టూరిజం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయంతో మొదలై ప్రస్తుతం రూ.4 కోట్లను దాటింది. అత్యధికంగా వేసవి, సెలవురోజుల్లో పర్యాటకులు ఇక్కడికి వస్తారు. బెంగళూరు, చెన్నై, చిత్తూరు, తిరుపతి, పుట్టపర్తి, అనంతపురం జిల్లాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బృందాలుగా ఇక్కడికి వచ్చి విడిది చేస్తారు.  

ప్రయివేటు కంపెనీలు తమ సిబ్బందిని విహారయాత్రగా పంపుతుంటారు. ఈ కంపెనీలను ముందుగా టూరిజం అధికారులు సంప్రదించడం ద్వారా హార్సిలీహిల్స్‌కు పంపేలా కృషి చేస్తుంటారు. ఒక్కో కంపెనీ నుంచి కనీసం లక్షకుపైబడిన ఆదాయం సమకూరుతుంది. దీనిపైనే స్థానిక టూరిజం అధికారులు దృష్టిపెట్టి ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే అతిథులకు అందించే సౌకర్యాలు, సేవలు సందర్శకులను ఆకట్టుకునేలా ఉంటాయి. దీనివల్ల ఒకసారి వచ్చివెళ్లిన సందర్శకులు మళ్లీ వస్తుంటారు. 
 

గత ఏడాది కోవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఆదాయం మొదలైంది. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఈ 12 నెలల కాలంలో రూ.4,02,53,364 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే టూరిజం అభివృద్ధి విషయంలో చర్యలు మొదలయ్యాయి. కొండను ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దడమే కాకుండా స్టార్‌ హోటల్‌ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు టూరిజం ఎండీ కన్నబాబు ఇటీవల హార్సిలీహిల్స్‌పై పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఎకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇటీవల పర్యాటకశాఖ ఉన్నతాధికారులు కొండకు వచ్చి చేపట్టాల్సిన అభివృద్ధిపై పరిశీలించి వెళ్లారు. దీనిపై ప్రణాళిక రూపుదిద్దుకొంటోంది.  

అభివృద్ధికి నిధులు 
హార్సిలీహిల్స్‌ యూనిట్‌ ద్వారా మరింత ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గదుల ఆధునీక రణ, ఇతర పనులకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు, చెన్నై పర్యాటకులను ఆకర్షిస్తున్న హార్సిలీహిల్స్‌పై స్టార్‌హోటల్‌ స్థాయి వసతులు కల్పించేందుకు పర్యాటకశాఖ దృష్టికి తీసుకెళ్లాం.      
– మిట్టపల్లె భాస్కర్‌రెడ్డి, ఏపీటీడీసీ డైరెక్టర్‌  

పరిశీలన పూర్తి 
హార్సిలీహిల్స్‌పై టూరిజం కార్యకలాపాల విస్తరణ, ఆధునీకరణ పనులపై ఉన్నతస్థాయి అధికార బృందం పరిశీలనలు పూర్తి చేసింది. భవిష్యత్తులో హార్సిలీహిల్స్‌ ఆదాయం భారీగా పెంచుకునేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.      
–నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, టూరిజం మేనేజర్, హార్సిలీహిల్స్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top