మదనపల్లె సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెరుగైన ర్యాంకులు తప్పకుండా సాధించాలి. ఇందుకు జాతీయ స్థాయి విద్యా విధానం (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కీలకంగా మారింది. ఈ తరుణంలో నగరాలు, పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితౖమైన సీబీఎస్‌ఈ సిలబస్ ఇక మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందనుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్ లక్ష్యంగా మరింత నాణ్యమైన, ఖరీదైన విద్య చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది.
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సీబీఎస్‌ఈ సిలబస్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా బడుల్లో ప్రధానోపాధ్యాయులు, సహాయ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు.
ప్రస్తుతం జాతీయస్థాయి పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ను సీబీఎస్‌ఈ సిలబస్‌లో పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సత్తా చాటేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరో తరగతిలో చేరితే +2 (ఇంటర్) విద్య వరకు విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్‌ఈ బోర్డు పరిధిలో ఉంటుంది.
పది అంశాలపై నివేదిక
సీబీఎస్‌ఈను అమలు చేయనున్న పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ముందుగా పది అంశాలపై కేంద్ర విద్యామండలికి నివేదిక అందజేసింది. పాఠశాలల గుర్తింపు, ఫైర్‌సేఫ్టీ, ధ్రువపత్రం, పాఠశాల యాజమాన్య కమిటీ, ఈపీఎఫ్ గుర్తింపు సంఖ్య, ఏకో ఫ్రెండ్లీ వాతావరణం, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విద్యార్హతలు, వెబ్‌సైట్ తదితర వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు జిల్లాలో 30 మండలాల పరిధిలో తొలివిడతగా 44 పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన అమలు కానుంది. అనంతరం సాధ్యాసాధ్యాలను పరిశీలించి మిగిలిన పాఠశాలల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
జిల్లాలో సీబీఎస్‌ఈకి ఎంపికైన పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. సీబీఎస్‌ఈ విధాననం ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేయనుంది.
పేద విద్యార్థులకు వరం
సీబీఎస్‌ఈ విధానం విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు కార్పొరేట్, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉన్న ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావడం శుభపరిణామం. కేంద్ర విద్యా మండలి నిబంధనల మేరకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న పాఠశాలల ఎంపిక వెబ్‌సైట్ ద్వారా జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 9 వ తరగతి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు ఇప్పటి నుంచే 8వ తరగతి విద్యార్థులను సన్నద్దం చేస్తున్నాం.
– క్రిష్ణప్ప, డివైఈఓ, మదనపల్లె
మంచి నిర్ణయం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య అందే అవకాశం ఉంటుంది.
– పి.మహమ్మద్‌ఖాన్, టీచర్, జెడ్పీహెచ్‌ఎస్,మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment