ఆహార భద్రతలో ఏపీ భేష్‌

Andhra Pradesh Tops In Food Safety - Sakshi

పకడ్బందీ ప్రజా పంపిణీ వ్యవస్థతో మెరుగైన ఫలితాలు

ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలను సేకరించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఏపీ

జన్‌ధన్‌ యోజన ఖాతాల నిర్వహణలోనూ రాష్ట్రానిది కీలక పాత్ర

వైద్యులు, నర్సులు, మిడ్‌వైఫరీల సంఖ్య విషయంలో 2వ స్థానం 

చిన్నారులకు టీకాలు వేయడంలో దేశంలో 3వ స్థానం 

సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ భారత్‌ ఇండెక్స్‌ వెల్లడి 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆహార భద్రతకు రాష్ట్రంలో ఢోకా లేదు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) అమలులో మన రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్లు తేలింది. తాజాగా నీతి ఆయోగ్, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) భారత్‌ ఇండెక్స్‌ నివేదికల ప్రకారం పలు అంశాల్లో ఏపీ అద్భుత ప్రతిభ కనబరిచినట్టు తేలింది. అందరికీ ఆహార భద్రత కల్పించడంలో వంద శాతం విజయవంతమైంది. ప్రతి కుటుంబానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించడంలో దేశంలోని ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీ చేస్తున్నట్టు నీతి ఆయోగ్, ఎస్‌డీజీ ఇండెక్స్‌లో తేలింది. 2020–21కి గాను ఎస్‌డీజీ భారత్‌ ఇండెక్స్‌లో హెల్త్‌ ఇన్‌స్రూ?న్స్‌ కల్పించడంలో వందకు 91.27 మార్కులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. 

వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి.. ర్యాంకులు ఇలా..
► గతంలో మాతా మరణాల నియంత్రణలో రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు మంచి ఫలితాలు సాధించింది. 59.63 శాతం మార్కులతో 5వ ర్యాంకు కైవసం చేసుకుంది. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ విషయంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
► 9 నెలల నుంచి 11 నెలల వయసున్న చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో ఏపీ ముందంజ వేసింది. గతంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది.
► వరి పండించే రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానం దక్కించుకుంది. ఈ అంశంలో పంజాబ్‌ మొదటి స్థానంలో నిలిచింది.
► రాష్ట్రంలో నర్సులు, ఫిజీషియన్లు, మిడ్‌ వైఫరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో పదో స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 95.14 మార్కులతో రెండో స్థానానికి చేరింది. 115 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది.
► నర్సులు, డాక్టర్ల రేషియో విషయంలో 95.14 మార్కులతో రెండో స్థానంలోను, సురక్షిత తాగునీటి సరఫరా అంశంలో 86.58 మార్కులతో మూడో స్థానంలోను మన రాష్ట్రం నిలిచింది.
► మరుగుదొడ్ల ఏర్పాటులోనూ ఏపీ ప్రగతి సాధించింది. నూటికి నూరు మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ కూడా చోటు దక్కించుకుంది.
► అందరికీ విద్యుత్‌ విషయంలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రతి ఇంటికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించటంలో వందకు వంద మార్కులు సాధించిన అతి కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కావడం గమనార్హం.
► వ్యర్థాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే విషయంలో ఏపీ మంచి ఫలితాలు సాధించింది. వంద శాతం మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 

► సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. 52.40 శాతం మార్కులతో ఈ ఘనత సాధించింది.
► ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాల విషయంలో రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది. 89.13 మార్కులతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఇందులో మహిళల ఖాతాల విషయంలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top