పాల ఉత్పత్తిలో టాప్‌ 5లో ఏపీ

Andhra Pradesh tops 5 in milk production - Sakshi

తలసరి పాల లభ్యతలో నాలుగో స్థానం 

మొత్తం పాల ఉత్పత్తిలో ఏపీ వాటా 6.97 శాతం  

కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడి 

సాక్షి, అమరావతి: జాతీయ సగటును మించి ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీ తలసరి పాల లభ్యత ఎక్కువగా ఉందని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ–2022 సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో రోజు వారీ తలసరి పాల లభ్యత 444 గ్రాములుండగా ఆంధ్రప్రదేశ్‌లో 799 గ్రాములుందని సర్వే పేర్కొంది.

దేశంలోని పది రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ లభ్యత కలిగి ఉన్నాయని సర్వే తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నాలుగోస్థానంలో ఉండగా.. మొదటి మూడు స్థానాల్లో వరుసగా పంజాబ్, రాజస్థాన్, హరియాణ ఉన్నాయి. గతేడాదికి సంబంధించి దేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. 

ఏపీ కంటే ముందువరసలో మొదటి నుంచి నాలుగు వరకు వరసగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ నిలిచాయి. దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో 53.11 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే జరుగుతోందని సర్వే వెల్లడించింది.

గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలిచ్చే ఆవులు, గేదెల సంఖ్య పెరగడమే కాకుండా వాటి పాల ఉత్పత్తి కూడా పెరిగిందని సర్వే వివరించింది. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా పాల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. 2020–21లో రాష్ట్రంలో 1,47,13,840 టన్నుల పాలు ఉత్పత్తి జరగ్గా 2021–22లో 1,54,03,080 టన్నుల ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top