భాషా సమస్యను భావోద్వేగాలతో చూడొద్దు..

Andhra Pradesh Official Language Association Hindi Language - Sakshi

వాస్తవిక, సామాజిక కోణంలో చూడాలి 

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ 

ఏయూక్యాంపస్‌ (విశాఖతూర్పు): భాషా సమస్యను భావోద్వేగాలతో కాకుండా వాస్తవిక, సామాజిక దృష్టి కోణంలో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ చెప్పారు.  ఏయూ హిందీ విభాగంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాతృభాషపై అమితమైన పట్టు సాధించాలని, జాతీయ స్థాయిలో రాణించాలంటే హిందీ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపునకు ఆంగ్ల భాష పరిజ్ఞానం అవసరమన్నారు. త్రిభాషా సూత్రాన్ని భారత్‌లో ఎప్పట్నుంచో అమల్లో ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్టు తెలిపారు.

ఇటీవల నిర్వహించిన అధికార భాషా సంఘం సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ హిందీ నేర్చుకోవాలని, పలకరించుకునే సందర్భాల్లో హిందీ భాషను ఉపయోగించాలని చెప్పడంలో తప్పులేదన్నారు. అమెరికాలో 2006లో అప్పటి యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ అధ్యక్షుడు బుష్‌ నేతృత్వంలో ఐదు విదేశీ భాషలను నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందని, వాటిలో హిందీ ఒకటనే విషయం మరువరాదన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ నరసింహారావు విజయవంతంగా నడిపాడంటే ఆయనకు హిందీ భాష రావడం కూడా ఓ కారణమన్నారు.

భాషకు సీఎం జగన్‌ పట్టాభిషేకం 
రాష్ట్రంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భాషల అభివృద్ధికి పాటుబడుతున్నారని యార్లగడ్డ తెలిపారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, అధికార భాషా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడం, ఆంగ్ల మాధ్యమాన్ని బోధన భాషగా, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు చదవాలని, హిందీ అకాడమీ ప్రారంభించడం, ఉర్దూను ద్వితీయ భాషగా బోధించేలా నిర్ణయం తీసుకోవడం వంటివి భాషల వికాసానికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయని లక్ష్మీప్రసాద్‌ వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top