206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

Andhra Pradesh: MPTC And ZPTC Election Votes Counting Of Votes In 206 Centers - Sakshi

ఒక్కో కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా కౌంటింగ్‌

కేంద్రాలపై అభ్యర్థులకు సమాచారం ఇచ్చిన రిటర్నింగ్‌ అధికారులు 

బ్యాలెట్‌ ఓట్లతో చాలా చోట్ల రాత్రి వరకు కొనసాగే అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీన పోలింగ్‌ జరిగిన నాటి నుంచి గత ఐదున్నర నెలలుగా బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచిన చోట కౌంటింగ్‌ నిర్వహించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక్కొక్క కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

అభ్యర్థులందరికీ కౌంటింగ్‌ కేంద్రాల వివరాలతో రిటర్నింగ్‌ అధికారులు శుక్రవారం సమాచారం అందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున బ్యాలెట్‌ పత్రాలను లెక్కించాల్సి రావడం, రాత్రి వరకు కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నందున జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ హాల్లోకి బ్యాలెట్‌ బాక్సులను తరలించే సమయంలో సీసీటీవీ కవరేజ్‌ చేయనున్నారు. 

ఏకకాలంలో రెండింటి లెక్కింపు..
ఒక్కో మండలానికి సంబంధించి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగే చోటే జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఏకకాలంలో రెండింటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సగం టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, మరో సగం టేబుళ్లలో జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఎంపీటీసీ పరిధిలోని ఓట్లన్నింటినీ ఒక డ్రమ్‌లో, మండలంలోని మొత్తం జడ్పీటీసీ ఓట్లన్నింటినీ మరో డ్రమ్‌లో వేసి కలగలపి తర్వాత 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత  జడ్పీటీసీ ఓట్లను వెయ్యి చొప్పున ఒక్కో టేబుల్‌కు పంపిణీ చేసి లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాల వారీగా అక్కడి ఓట్లన్నింటినీ ఒకే టేబుల్‌పై ఒకేవిడతలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక్కో ఏజెంట్‌ చొప్పున నియమించుకునేందుకు అభ్యర్థులను అనుమతించారు. 

లెక్కింపులో 42,360 మంది సిబ్బంది
ఓట్ల లెక్కింపులో మొత్తం 42,360 మంది సిబ్బంది పాల్గొంటారు. 11,227 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా, 31,133 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. వీరు కాకుండా 89 మందిని అదనపు అబ్జర్వర్లుగా ఆయా జిల్లా కలెక్టర్లు నియమించారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించి తరువాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు చేపడతారు. బ్యాలెట్‌ పేపరు రంగు ఆధారంగా రెండు రకాల ఓట్లను వర్గీకరిస్తారు. కౌంటింగ్‌ సమయంలో సిబ్బంది సందేహాల నివృత్తి కోసం కమాండ్‌ కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

అభ్యంతరాలు వ్యక్తమయ్యే చోట ఒక్కసారి మాత్రమే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు. మరోవైపు కౌంటింగ్‌ పర్యవేక్షణ కోసం జిల్లాకో ఐఏఎస్‌ అధికారిని పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌
ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా టీకాలు తీసుకుని ఉండాలని స్పష్టం చేశారు. ఆయా  కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

24 గంటలు కంట్రోల్‌ రూం: ద్వివేది
కౌంటింగ్‌ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 24 గంటలూ పని చేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్‌ చెప్పారు. కేంద్రాల వద్ద శానిటేషన్‌ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top