AP Cabinet Meeting: సీఎం జగనే మాకు బలం

Andhra Pradesh Ministers after meeting Cabinet - Sakshi

కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు కొండంత బలమని మంత్రులు చెప్పారు. సీఎం జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..


జగన్‌కు సైనికుడిగా పని చేయడమే ఇష్టం
సీఎం వైఎస్‌ జగన్‌కు సైనికుడిగా పనిచేయడమే నాకు ఇష్టం. అందరం సమష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తాం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మొదట్లోనే సీఎం చెప్పారు. అందులో భాగంగానే నేడు మంత్రులందరం చాలా సంతోషంగా రాజీనామాలు చేశాం.
– అనిల్‌ కుమార్, జల వనరుల శాఖ మంత్రి

పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశం
మంత్రులందరం రాజీనామా చేశాం. మరికొందరికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. పార్టీ కోసం పని చేసే గొప్ప అవకాశాన్ని సీఎం మాకు కల్పిస్తున్నారు. ఇదో గొప్ప అరుదైన క్షణం.
– సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి

ఓటర్లంతా జగన్‌ వైపే
నేను చాలా అదృష్టవంతుడిని. పేద కుటుంబంలో పుట్టా. మంత్రి పదవి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా సమర్థంగా పనిచేశాను. ఓటర్లంతా జగన్‌ వైపు ఉన్నారు. కోటీశ్వరులు అంతా టీడీపీ వెంట ఉన్నారు. బలమైన నాయకుడు జగన్‌ని ఎదుర్కొనేందుకు పవన్‌ కల్యాణ్, చంద్రబాబు వంటి బలహీనులంతా ఏకమవుతున్నారు.
– నారాయణ స్వామి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి

ఏ బాధ్యతలు ఇచ్చినా చేయడానికి సిద్ధం
మాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాం. ఇకపై సీఎం ఏ బాధ్యతలు అçప్పగించినా చేయడానికి సిద్ధం. అవసరం మేరకు కొందరికి కేబినెట్‌ హోదాలో ప్రాంతీయ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తారనేది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది.
– తానేటి వనిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి 

ఎక్కడైనా సమర్థంగా పనిచేస్తాం
మేమందరం ప్రభుత్వానికి, పార్టీకి నిండు మనసుతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు ఇచ్చాం. ఎవ్వరూ అసంతృప్తితో లేరు. మా సీఎం జగన్‌ నాయకత్వంలో ఎక్కడైనా సమర్థంగా పని చేస్తాం. 
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

పార్టీ బాధ్యతలను గౌరవంగా స్వీకరిస్తా
మూడేళ్లు సీఎంతో కలిసి పని చేసే అవకాశం దక్కడం గొప్ప వరం. మంత్రిగా పర్యాటక రంగం అభివృద్ధికి కొత్త పాలసీని తేవడం సంతృప్తినిచ్చింది. కరోనా లేకుంటే మంచి ఫలితాలు సాధించేవాళ్లం. పార్టీ బాధ్యతలు గౌరవంగా భావిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాం.
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి

పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం
కేబినెట్‌ ఎలా ఉండాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే మా బాధ్యత. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌కంటే మెరుగ్గా పనిచేస్తున్నారు. ఏ వాగ్దానంతో  అధికారంలోకి వచ్చారో దానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నారు.
– బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి

సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఐదారుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. నాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజీనామా విషయంలో సీఎం జగనే ఎక్కువగా బాధపడ్డారు. పార్టీ పరంగా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కట్టుబడి  ఉంటామని ముఖ్యమంత్రికి తెలిపాం.
 – వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ మంత్రి

సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తాం. సీఎం ఒక ఆశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇకపై పార్టీ బలోపేతానికి పనిచేస్తాం. అనుభవం, సమీకరణల రీత్యా కొందరిని కొనసాగిస్తున్నట్లు సీఎం చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కేబినెట్‌ లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజల కోసం శక్తివంచన లేకుండా పని చేసిన సీఎం జగన్‌ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు.
– కొడాలి నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top