షోకాజ్ నోటీసు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవద్దు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తీర్పు వాయిదా
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడకూడదన్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను అవమానకరంగా మాట్లాడినందుకు సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ జారీ చేసిన షోకాజ్ నోటీసు ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఉత్తర్వులు జారీ చేశారు.
షోకాజ్ నోటీసులను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేవీ సూర్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. షోకాజ్ నోటీసుపై అధికరణ 226 కింద దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని చెప్పారు.
ఈ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. సంఘం అధ్యక్షుడి సమాధానం ఆధారంగా తుది చర్యలుంటాయన్నారు. ఉద్యోగ సంఘం వారి సమస్యలపై పోరాటం చేయడం, సంఘం ప్రతినిధులు గవర్నర్‌ను కలవడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కించపరుస్తూ మాట్లాడటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంతర్గత, సున్నిత, కీలక సమాచారాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేశారని, దీనిపైనే తమకు అభ్యంతరమని చెప్పారు.
ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ సంఘం ప్రతినిధులకు భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదన్నారు. వారికి నియమావళి ఉంటుందని, దానికి లోబడే పని చేయాలని చెప్పారు.
అంతకు ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌ను కలిశారన్న కోపంతోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. సంఘం గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు నామమాత్రపు చర్యేనని తెలిపారు.
మరిన్ని వార్తలు :