సేకరించిన భూమిని వెనక్కి ఇవ్వక్కర్లేదు | Andhra Pradesh High Court On Land acquisition | Sakshi
Sakshi News home page

సేకరించిన భూమిని వెనక్కి ఇవ్వక్కర్లేదు

May 25 2022 5:07 AM | Updated on May 25 2022 8:47 AM

Andhra Pradesh High Court On Land acquisition - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఓ నిర్ధిష్ట ప్రయోజనం కోసం తీసుకున్న భూమిని సుదీర్ఘ కాలంపాటు ఉపయోగించకున్నా, ఆ భూమిని తిరిగి సదరు భూ యజమానికి ఇవ్వాల్సిన అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆ భూమికి ప్రభుత్వమే యజమాని అవుతుందని తేల్చిచెప్పింది. దానిని ఇతర ప్రజా ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించ వచ్చునంది. అలాగే, ఓసారి ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుని భూమిని ఇచ్చేసిన తరువాత, ఆ భూమిని తిరిగి వెనక్కి ఇవ్వాలని యజమాని కోరలేడని.. తీసుకున్న పరిహారాన్ని వెనక్కి ఇచ్చేందుకు ఆ యజమాని సిద్ధమైనా కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సిన అవసరంలేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.

నా భూమి నాకిచ్చేయండి..
పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2004లో కర్నూలు జిల్లా దేవనూరు గ్రామానికి చెందిన పాణ్యం సుంకిరెడ్డికి చెందిన 2.57 ఎకరాల భూమిని తీసుకుంది. ఇందుకుగాను ఆయనకు రూ.1.54 లక్షల పరిహారం కూడా చెల్లించింది. అయితే.. ఆ భూమిని ఇప్పటివరకు ఆ ప్రయోజనం కోసం ఉపయోగించలేదని, అందువల్ల తన భూమిని తనకు తిరిగి ఇచ్చేయాలని, తనకిచ్చిన పరిహారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ సుంకిరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ, వారు స్పందించకపోవడంతో సుంకిరెడ్డి 2015లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఆయన ఇటీవల తీర్పు వెలువరించారు. 

భూసేకరణ తరువాత ప్రభుత్వమే యజమాని
‘బోర్డ్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌ (బీఎస్‌ఓ) 90 ప్రకారం.. నిర్ధిష్ట ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతర ప్రయోజనాల కోసం కూడా వినియోగించవచ్చు. పరిహారం చెల్లించి తీసుకున్న భూమికి ప్రభుత్వమే యజమాని అవుతుంది. ఏ ప్రయోజనం కోసమైతే భూమిని తీసుకున్నారో అందుకు భూమిని వినియోగించలేదన్న కారణంతో దానిని వెనక్కి ఇవ్వాలని యజమాని కోరడానికి వీల్లేదు. ఎందుకంటే.. అతను చట్టబద్ధ ప్రయోజనాలన్నీ పొందాడు.

ఓసారి భూ సేకరణ ప్రక్రియ ముగిసిన తరువాత ఆ భూమి ప్రభుత్వపరమైనట్లే. అంతేకాక.. దేవనూరు గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకే ఆ భూమిని ఉపయోగిస్తున్నారు. ఇది కూడా ప్రజా ప్రయోజనమే. నీటిపారుదల శాఖ వద్దనున్న ఆ భూమిని స్వాధీనం చేçసుకునేందుకు కలెక్టర్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది’.. అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement