
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్‌ఆర్‌సీ) రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్‌లో ఎందుకు ఉందని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలంది. ఆంధ్రప్రదేశ్‌లోనే హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది.
హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గడువు కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.