ప్రాసెసింగ్‌ చార్జీలొద్దు | Sakshi
Sakshi News home page

ప్రాసెసింగ్‌ చార్జీలొద్దు

Published Thu, Nov 3 2022 3:10 AM

Andhra Pradesh govt more supportive of DWCRA savings societies - Sakshi

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్‌ చార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం బుధవారం రిజర్వు బ్యాంకు అప్‌ ఇండియా (ఆర్‌బీఐ)ను కోరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో మహ్మద్‌ ఇంతియాజ్‌ బుధవారం ముంబయిలోని రిజర్వు బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలోని ఛీప్‌ జనరల్‌ మేనేజర్, హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయ జనరల్‌ మేనేజర్‌తో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్లకు వేర్వేరుగా లేఖ రాశారు.

రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రస్తుతం పొదుపు సంఘాల రుణ మొత్తంపై 0.5 శాతం నుంచి 1.2 శాతం దాకా ప్రాసెసింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులు బాటు ఉంది. అంటే, మహిళలు రూ.20 లక్షల రుణం తీసుకుంటే సుమారు రూ.20 వేలు ప్రాసెసింగ్‌ ఫీజు పేరిట బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి.

పొదుపు సంఘాలు తీసుకునే రుణాల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఈ తరహా ప్రాసెసింగ్‌ చార్జీలు వారికి భారంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్‌ చార్జీలతో పాటు డాక్యుమెంటేషన్‌ చార్జీలు, ఇతర అడహాక్‌ చార్జీలు సైతం బ్యాంకులు వసూలు చేయకుండా అన్ని బ్యాంకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరింది. 

రుణాల చెల్లింపులో దేశంలోనే ప్రథమ స్థానం
పొదుపు సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరాతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి సున్నా వడ్డీ పథకం అమలు వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలలో 99.5 శాతం సకాలంలో చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో బ్యాంకులు కూడా మహిళా పొదుపు సంఘాల గరిష్ట పరిమితి మేరకు రుణాలు ఇస్తున్నాయి.

మరో పక్క.. రాష్ట్రంలో పొదుపు సంఘాల పేరిట ప్రస్తుతం రూ.30 వేల కోట్ల పైబడి మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఉన్నారు. అందులో ఎప్పటికప్పుడు కిస్తీ ప్రకారం పాత రుణాల చెల్లింపులు పూర్తి కాగానే, తిరిగి కొత్తగా ఏటా రూ.15 వేల కోట్లు రుణాలు పొందుతున్నారు. 

ఇప్పటికే కొన్ని బ్యాంకుల స్పందన
► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.2.5 లక్షల వరకు ప్రాసెసింగ్‌ చార్జీలను మినహాయిస్తూ ఆర్బీఐ గతంలోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల కిత్రం వరకు మన రాష్ట్రంలోనూ అత్యధిక సంఘాలు ఈ పరిమితి మేరకే బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితి ఉండింది.  

► అయితే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రూ.10 లక్షలకు పైబడే రుణాలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్‌ చార్జీ భారంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టి రాగానే.. గత రెండేళ్లగా జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశాలన్నింటిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చింది. 

► ఫలితంగా రూ.10 లక్షల వరకు ప్రాసెసింగ్‌ చార్జీలను మినహాయిస్తూ యూనియన్‌ బ్యాంకు (గతంలో ఆంధ్రా బ్యాంకు) 2021 సెప్టెంబర్‌ 1వ తేదీన అన్ని బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా 2021 ఆగస్ట్‌ 23వ తేదీన అదే తరహా ఉత్తర్వులిచ్చింది. 

► సకాలంలో చెల్లింపులు జరుగుతుండడంతో ఇప్పుడు బ్యాంకులు రూ.20 లక్షల దాకా సంఘాల పేరిట రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్‌ చార్జీల మినహాయింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని సమావేశ మినిట్స్‌లో ఉదహరించి, అన్ని బ్యాంకులకు ఆదేశాలివ్వాలంటూ సూచన చేశారు.  

► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు (అప్కాబ్‌) ఇప్పటికే రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాల రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు వసూలును పూర్తిగా మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు.   

Advertisement
 
Advertisement