మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి | Sakshi
Sakshi News home page

మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి

Published Wed, Nov 22 2023 5:31 AM

Andhra Pradesh Bags Best Marine State Award - Sakshi

సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ప్రగతి సాధించిందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాల కితా­బిచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 2023లో బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌గా ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఫిషరీస్‌ కాన్ఫరెన్స్‌ ఇండియా–2023లో కేంద్రమంత్రి రూపాల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆప్సడా) కో–వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్, మత్స్య­శాఖ అడిషనల్‌ కమిషనర్‌ అంజలి అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రూపాల మాట్లా­డుతూ.. మత్స్య ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమ­తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.

ఈ రంగంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఆక్వా ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రలో తీసుకొచ్చిన చట్టాలు, మార్పులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఇస్తున్న చేయూతతో నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు మార్కెటింగ్‌ సౌకర్యాలు మరింత మెరుగు పర్చాలని సూచించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ కృషి ఫలితమే
ఈ సందర్భంగా అప్సడా కో–వైస్‌ చైర్మన్‌ రఘురామ్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రెండోసారి బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌గా ఏపీ నిలవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులే కారణమన్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు ఆక్వా రైతులకు భరోసా, భద్రత కల్పించేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా కోసం ఏపీ స్టేట్‌ సీడ్, ఫీడ్‌ యాక్టులను తీసుకొచ్చిందన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ అంజలి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2018–19లో 39 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో ఏకంగా 52 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. 

Advertisement
Advertisement