సాక్షి, అమరావతి: దివ్యాంగ లబ్ధిదారులకు జాతీయ రహదారి టోలింగ్ వ్యవస్థను మరింత అందుబాటులోకి తెచ్చేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త మార్గదర్శకాల్లో సవరణ చేసింది. దివ్యాంగులు రాయితీ పొందిన ఫాస్టాగ్ జారీ, పునరుద్ధరణలో మార్పు తీసుకొచ్చింది. శారీరక వైకల్యం కలిగిన వ్యక్తుల వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకు, ‘దివ్యాంగజన్’ యాజమాన్యం కింద నమోదు చేసిన వాహనాలకు రాయితీ ఫాస్టాగ్ జారీ చేస్తారు.
వైకల్య ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు, సంబంధిత రికార్డుల మేరకు వైకల్య శాతం ఆధారంగా రాయితీ ఫాస్టాగ్‌లు ఇస్తారు. వీటిని ఏడాదికోసారి రెన్యువల్ చేసుకోవాలనే నిబంధనను సవరించడంతో.. 70శాతం నుంచి నూరు శాతం వైకల్యం ఉన్న వ్యక్తులకు ఐదేళ్లపాటు, 40శాతం నుంచి 70శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులకు మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత మళ్లీ అర్హత ధ్రువపత్రాలతో జాతీయ రహదారుల ఫీజు నియమాలు–2008లకు లోబడి మళ్లీ రాయితీ ఫాస్టాగ్‌ను పునరుద్ధరించుకోవచ్చు.


