ప్రజారోగ్యంపై పగ | Ambulance services have been suspended for the past 3 weeks | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై పగ

Dec 4 2024 5:47 AM | Updated on Dec 4 2024 7:14 AM

Ambulance services have been suspended for the past 3 weeks

డయాలసిస్‌ బాధితులకు 108లో ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం మంగళం.. గత 3 వారాలుగా నిలిచిపోయిన సేవలు 

డయాలసిస్‌ కోసం అంబులెన్స్‌లు రావంటున్న కాల్‌ సెంటర్లు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా రద్దు  

చంద్రబాబు ప్రభుత్వంపై రోగుల ఆగ్రహం 

మళ్లీ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్‌.. రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రి వరకూ ఉచిత రవాణా కల్పించిన గత ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేసేశారంటూ ప్రతి వేదికపై గుండెలు బాదుకుంటున్న సీఎం చంద్రబాబే నిజానికి వాటన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. గతంలో పేదలకు మేలు చేసిన అనేక కార్యక్రమాలకు ఆయన మంగళం పాడుతూ రివర్స్‌ పాలన చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఉన్నపళంగా నిలిపేసి వారిని కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. చివరికి.. వారి ప్రాణాలతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. 

ముఖ్యంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, అనుయాయులకు వాటి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం నిధులు చెల్లించకుండా 108, 104 వాహనాలను మూలనపడేయడం ఇందుకు నిదర్శనం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి రోగులకు చుక్కలు చూపుతోంది. ఇందులో భాగంగా డయాలసిస్‌ రోగులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రవాణా సదుపాయానికి కూడా తిలోదకాలిచ్చింది. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో డయాలసిస్‌కు ఆస్పత్రికి వెళ్లాల్సిన వ్యక్తి 108 అంబులెన్సుకు ఫోన్‌చేస్తే నిమిషాల వ్యవధిలోనే రోగి ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గత మూడు వారాలుగా ఈ సేవలకు మంగళం పాడేసింది. బాధితులు 108కు ఫోన్‌ చేసినా అంబులెన్స్‌లు రావడంలేదు. ‘కేవలం తీవ్ర అనారోగ్య సమస్యలుంటేనే అంబులెన్స్‌ వస్తుంది.. డయాలసిస్‌ కోసం రాదు’ అని కాల్‌సెంటర్‌ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారని డయాలసిస్‌ బాధితులు వాపోతున్నారు.

అవస్థలుపడుతూ ఆస్పత్రులకు.. 
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 600 మందికి పైగా రోగులు 108 అంబులెన్సుల ద్వారా డయాలసిస్‌కు వెళ్లేవారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూలై వరకూ 2.50 లక్షల మందికి పైగా ఉచిత రవాణా సదుపాయాన్ని వినియో­గించుకున్నారు. 

కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 108 సేవలపై చీకట్లు కమ్ముకున్నాయి. డీజిల్‌కు కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. ఫలితంగా డయాలసిస్‌తో పాటు ఇతర అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు రాక కొందరు మరణించారు. 

ఉచిత రవాణా కల్పించాలని డిమాండ్‌.. 
ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా డయాలసిస్‌ రోగులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో కిడ్నీ బాధితులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. గ్రామానికి 30 నుంచి 50 కి.మీల దూరంలో ఉండే డయాలసిస్‌ కేంద్రాలకు ఒకసారి వెళ్లి రావాలంటే కనీసం రూ.500 నుంచి రూ.1,500 వరకూ బాధితులు ఖర్చుచేయాల్సి వస్తోంది. 

కొందరికి వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్‌ అవసరమవుతోంది. వారికి ఈ ఖర్చు తలకుమించిన భారమవుతోంది. దీంతో.. ప్రయాణ ఖర్చులకు భయపడి కొందరు డయాలసిస్‌ను నిర్లక్ష్యంచేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం నెలకొంటోంది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి 108 అంబులెన్స్‌ల్లో ఉచిత రవాణాకు అవకాశం కల్పించాలని డయాలసిస్‌ రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ బస్సుల్లోనైనా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది.. 
కొన్నేళ్లుగా నా భర్త చిరంజీవికి డయాలసిస్‌ చేయిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 108 ద్వారా ఉచితంగా ఆస్పత్రికి తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు వాహనం రావడం లేదు. వారంలో మూడు రోజులు సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి ఉంది. దీంతో ఆటోలో వచ్చినప్పుడల్లా రూ.300 వరకు ఖర్చవుతోంది. 

ఆటోలో వస్తున్న సమయంలో నా భర్త ఒక్కోసారి అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది. ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మాలాంటి వారిని ఆదుకోవాలి.– లీలావతి, వడ్డిపల్లి, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా 



తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు.. 
మా తమ్ముడు సత్యనారాయణ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి భార్య లేదు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో డయాలసిస్‌కు నేనే తీసుకురావాల్సి వస్తోంది. ప్రతిసారీ రూ.500 వరకు ఖర్చవుతోంది. మాలాంటి పేదలకు ప్రతిసారీ ఇలా రూ.వందలు ఖర్చు పెట్టుకోవడం చాలా భారంగా ఉంది. డయాలసిస్‌ చేయించుకుని తీసుకెళ్లేలోపు నా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు. – జయలక్ష్మి, ధర్మభిక్షం కాలనీ, అక్కంపల్లి, అనంతపురం జిల్లా 

మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి..
అప్పు చేసి డయాలసిస్‌ కోసం తిరుగుతున్నాం. గత ప్రభుత్వం డయాలసిస్‌ రోగుల కోసం 108 అంబులెన్సులో ఉచిత ప్రయాణ సేవలు అందించింది. దీంతో మాకు రవాణా ఖర్చులు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి 108 సేవలను ఆపేశారు. దీంతో రవాణా చార్జీలు కష్టంగా మారాయి. మేము బంగారుపాళ్యం నుంచి ఆటోలో రావాలంటే రూ.500పైన డబ్బులు తీసుకుంటున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి. –శ్యామల, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి.. ఆంజనేయులు. అనంతపురం రూరల్‌ పరిధిలోని కొడిమి నివాసి అయిన ఈయన గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అనంతపురం సర్వజనాస్పత్రికి వారంలో మూడుసార్లు డయాలసిస్‌ కోసం వెళ్లాల్సి ఉంది. గత ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆంజనేయులు 108 అంబులెన్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచి ఆస్పత్రికి వచ్చేవాడు. 

అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఉచిత రవాణా సదుపాయాన్ని నిలిపేయడంతో కుమారుడితో కలిసి బైకుపైన అవస్థలు పడుతూ ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలా ఆంజనేయులు ఒక్కరే కాదు.. డయాలసిస్‌ రోగులకు చంద్రబాబు ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం నిలిపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.

కొండ్రు ఇసాక్, అతడి భార్య రాణమ్మ. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం విజయనగర్‌ కాలనీలో వీరు నివాసముంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా వీరు నెలలో 13 రోజులు 30 కిలోమీటర్లు ప్రయాణించి కనిగిరి వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికి వచ్చి అంబులెన్స్‌ తీసుకువెళ్లేదని, డయాలసిస్‌ చేయించుకుని ఇంటికి వచ్చేవారమని ఆ దంపతులు చెబుతున్నారు. 

అయితే ఇప్పుడు మూడు వారాలుగా అంబులెన్స్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో వెళ్తుంటే రూ.1,000 నుంచి 1,500 తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలా నెలలో 13 రోజులకు ఆటోకి రూ.19,500 అవుతోందని, ఇది కాకుండా మందులు రూ. 5,000 వరకూ అవుతున్నాయని కలత చెందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement