ముందుగానే నీటి విడుదల

Ambati Rambabu On Kharif Crop Cultivation Water release - Sakshi

నేడు గోదావరి డెల్టాకు విడుదల

ఈనెల 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌కు 

గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు ఆయకట్టుకూ 10 నుంచి సరఫరా

ఈనెల 30న శ్రీశైలం కుడిగట్టు కాలువ ఆయకట్టుకు విడుదల

జూలై 15 నుంచి నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు  

లభ్యత ఆధారంగా ఈ నెలలోనే వంశధార ఆయకట్టుకు కూడా

చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఖరీఫ్‌ సాగుకు ముందుగా విడుదల 

తుపాన్ల బారిన పడకుండా నూర్పిళ్లు పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు ఖరీఫ్‌ పంటల సాగుకు ముందుగా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్‌ 1న నీటి సంవత్సరం ప్రారంభమయ్యే రోజే గోదావరి డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్‌ సాగును రైతులు ముందుగా చేపడతారు.

సకాలంలో పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు చేతికి అందనున్నాయి. నవంబర్‌లో తుపాన్ల ప్రభావం ప్రారంభమయ్యేలోగా పంట నూర్పిళ్లు పూర్తవుతాయి. తద్వారా ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మరోవైపు ఖరీఫ్‌ నూర్పిళ్లు పూర్తి కాగానే సకాలంలో రబీ పంటల సాగు చేపట్టవచ్చు. నీటి లభ్యతను బట్టి మూడో పంట కూడా సాగు చేసుకునే వెసులుబాటను రైతులకు కల్పించాలన్నది సీఎం జగన్‌ సంకల్పం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

ముందుచూపుతో నీటి నిల్వ..
ఖరీఫ్‌ పంటకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో పులిచింతల, గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని నిల్వ చేసేలా జలవనరులశాఖను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మే 12న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జలాశయాల్లో నీటి నిల్వలు, లభ్యతను సమీక్షించిన సీఎం జగన్‌ ఆయకట్టుకు ముందుగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో ఐఏబీ (నీటి పారుదల సలహా మండలి) సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. ముందుగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని, సకాలంలో పంటల సాగు చేపట్టాలని రైతులను చైతన్యం చేసింది.

వరుసగా నాలుగో ఏడాది..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండటంతో వరుసగా 2019, 2020, 2021లో ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నీటి లభ్యత బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదీ కోటి ఎకరాలకు నీళ్లందుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌కు
► పోలవరంలో నిల్వ చేసిన నీటిని రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా విడుదల చేసి గోదావరి డెల్టాకు బుధవారం నుంచే సరఫరా చేయనున్నారు.
► పులిచింతల ప్రాజెక్టులో 33.14 టీఎంసీలు నిల్వ ఉండగా ఈ నెల 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్‌కు విడుదల చేయనున్నారు. గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, వెలిగల్లు ప్రాజెక్టుల ఆయకట్టుకూ ఈ నెల 10 నుంచే నీరు  విడుదల కానుంది.
► పెన్నా బేసిన్‌లోని సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు జూన్‌ 10 నుంచే నీటిని సరఫరా చేస్తారు. 
► గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటితో ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈనెల 30 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు జూలై 15 నుంచి నీటిని సరఫరా చేస్తారు. 
► గొట్టా బ్యారేజీలో నీటి లభ్యత ఆధారంగా ఈ నెలలోనే వంశధార ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
► తుంగభద్ర డ్యామ్, సుంకేశుల బ్యారేజీపై ఆధారపడ్డ హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్‌ ఆయకట్టుకు లభ్యత ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top