
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లీడ్ బ్యాంకులను కేటాయించింది. వీటికి లీడ్ జిల్లా మేనేజర్లను నియమించాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించింది. జిల్లాల వారీగా ఆయా లీడ్ జిల్లా మేనేజర్లకు ప్రత్యేకంగా కార్యాలయాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరింది.
ఈ మేనేజర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, కార్యక్రమాల అమలు, వాటి సమన్వయ బాధ్యతను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ కార్యాలయాలకు అవసరమైన నైపుణ్య సిబ్బందితో పాటు కంప్యూటర్లను ఏర్పాటుచేయాలని ఇటీవల బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆయా బ్యాంకులకు సూచించింది.
నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని లీడ్ జిల్లా మేనేజర్లుగా నియమించాలని కోరింది. నైపుణ్య సిబ్బంది కొరత ఉంటే ఆ సేవలను బయట నుంచి పొందడానికి అనుమతిస్తున్నట్లు కమిటీ పేర్కొంది.
జిల్లాల్లో వివిధ బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన నిమిత్తం సమావేశాలు నిర్వహించేందుకు, వాటికి హాజరయ్యేందుకు వీలుగా లీడ్ జిల్లా మేనేజర్లకు ప్రత్యేకంగా వాహనాలూ సమకూర్చాల్సిందిగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించింది.