సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు | Sakshi
Sakshi News home page

సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు

Published Wed, Dec 27 2023 5:12 AM

Adudam Andhra Competition started  - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలు తొలిరోజు అంబరాన్ని అంటే సంబరంతో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరులోని నల్లపాడు లయోలా పబ్లిక్‌ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 6,174 చోట్ల షెడ్యూల్‌ ప్రకారం పోటీలను నిర్వహించారు.

ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు ఐదు క్రీడాంశాల్లో కలిపి మొత్తం 33,722 పోటీలు జరిగాయి. సాంప్రదాయ క్రీడాంశాలైన యోగా, మారథాన్‌ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 26 జిల్లాల్లోనూ 5 లక్షలకుపైగా ప్రేక్షకులు నేరుగా ఆడుదాం ఆంధ్రా పోటీలను వీక్షించినట్టు సమాచారం. దాదాపు 50 శాతం జిల్లాల్లో 100 శాతం, మిగిలిన జిల్లా్లల్లో 99 శాతం వరకు జట్ల కూర్పు పూర్తయింది. జనవరి 9లోగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేసేలా రోజూ ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం పని చేస్తోంది.

తుది నివేదిక ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు 37.23 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందులో 23.48 లక్షల మంది పురుషులు, 13.75 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. వలంటీర్ల ద్వారా మాన్యువల్‌ స్కోరింగ్‌తో పాటు పారదర్శకత కోసం క్రిక్‌ క్లబ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మంది శిక్షణ పొందిన వలంటీర్లకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడల స్కోరింగ్‌కు ప్రత్యేక లాగిన్లు అందించారు. సచివాలయ స్థాయి పోటీల్లో విజేతలకు అందించేందుకు వీలుగా టీషర్టులు, టోపీలను వేగంగా సరఫరా చేస్తున్నారు. 17.10 లక్షల జతలకు గాను 8 లక్షలకు పైగా ఇప్పటికే జిల్లాలకు చేరాయి. 

కోస్తా.. వెల్లివిరిసిన ఆనందం..
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో పోటీలను కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, ఎంపీ భరత్‌రామ్‌ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 511 సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఆటల పోటీలకు 90 వేల మంది పురుషులు, 40 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,16,171 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారు.

రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు, భీమవరంలో కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతిలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 1.43 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 1.71 లక్షల మంది క్రీడల్లో పాల్గొనటానికి పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఏలూరు జిల్లాలో 5 ప్రధాన క్రీడలకు సంబంధించి 14,354 టీమ్‌లను సిద్ధం చేసి 7,198 మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడలో కలెక్టర్‌ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ విభాగాల్లో 11 వేలకు పైగా జట్లు ఆడనున్నాయి. కృష్ణా జిల్లాలో వివిధ క్రీడల్లో 1.12 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు.

పురుషుల్లో 7 వేల జట్లు, మహిళల్లో 4వేల జట్లు ఉన్నాయి. పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ పతాకంతో 2 కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 3,280 అడుగుల పొడవున రూపొందించిన జాతీయ జెండాతో క్రీడాకారులు గాంధీనగర్‌ నుంచి చీమకుర్తిలోని ప్రభుత్వ హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. దర్శిలో జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు జరిగాయి.

ఉత్తరాంధ్రలో ఉరిమిన ఉత్సాహం..
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో 11,500 జట్లు నమోదు చేసుకోగా.. 670 క్రీడా మైదానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 976 సచివాలయాల పరిధిలో 485 మైదానాల్లో ఐదు క్రీడాంశాల్లో ఆటల పోటీలు జరిగాయి. మొత్తం 2.07 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

విజయనగరంలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి.. ఆటల పోటీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమితులైన కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పతక విజేత మత్స్య సంతోషి, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, స్కేటింగ్‌ క్రీడాకారుడు సాయితేజలను ఘనంగా సత్కరించారు.

విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెంలో జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అన­కాపల్లిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, ఎంపీ సత్యవతి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 14,098 టీములు, అందులో 1.31 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.

రాయలసీమ.. ఆటాడుకుందాం రా..
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,89,929 మంది, నంద్యాల జిల్లాలో 1.25 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో 645, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పోటీలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 515 క్రీడామైదానాల్లో పోటీలు జరిగాయి.

తిరుపతి జిల్లాలో పలు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ పోటీలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. 

Advertisement
Advertisement