రాజధానుల వ్యాజ్యాలపై విచారణ వాయిదా

Adjournment of hearing on capital amaravati lawsuits - Sakshi

షెడ్యూల్‌ ఖరారు తరువాత వరుసగా విచారిస్తామన్న ధర్మాసనం

అత్యవసర విచారణ అవసరం ఉందన్న ఏజీ

సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన వ్యాజ్యాలపై తదుపరి విచారణను హైకోర్టుమే 3వతేదీకి వాయిదా వేసింది. ఆ రోజు నుంచి విచారణ ప్రారంభిస్తామని ప్రకటించింది. విచారణ మొదలు పెట్టిన తరువాత పరిస్థితులను బట్టి రోజూవారీ పద్ధతిలో విచారణ జరపడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వ్యాజ్యాలను భౌతిక విచారణ / వీడియో కాన్ఫరెన్స్‌ / హైబ్రీడ్‌ విధానాల్లో ఏ రూపంలో విచారించాలో ఆ రోజు కోవిడ్‌ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 

అత్యవసర విచారణ అవసరం...
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేసి పరిమిత సంఖ్యలో న్యాయవాదులను అనుమతిస్తూ హైబ్రీడ్‌ విధానంలో విచారణ జరపాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించిన వ్యాజ్యాలను ఈ వ్యాజ్యాల నుంచి వేరు చేసి విచారించాలని అభ్యర్థించారు.

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఏప్రిల్‌ రెండో వారంలో వరుస సెలవులు ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. షెడ్యూల్‌ ఖరారు చేసిన తరువాత వరుసగా విచారణ కొనసాగిస్తామని తెలిపింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు వేసవి సెలవులకు ఇబ్బంది లేకుండా ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను మే 3కి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top