51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్‌

51 Lanka Villages Cut Off From The Outside - Sakshi

ధవళేశ్వరం: ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద నీరు భారీగా చేరుకుంది. దాంతో ఇప్పటివరకూ 25 లక్షలు 8 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడుదల చేశారు. గోదావరి ఉధృతితో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి పాయలు పోటెత్తుతున్నాయి. గోదావరి పాయలు ముంచెత్తడంతో లంకల్లో ఆరుడగుల వరద నీరు చేరింది. కోనసీమలో 51 లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటిగట్లపై ఉన్నతాధికారులు దష్టిసారించారు. 40 వేల ఇసుక బస్తాలతో బలహీనమైన ప్రాంతాల్లో ఏటి గట్లను పట్టిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు, ఏటిగట్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా వాలంటీర్లతో బండ్‌ పెట్రోలింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.

కోనసీమ జిల్లాలోని 88 గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. కోనసీమ‌జిల్లాలో ఇప్పటి వరకు 18 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరద పరిస్ధితులని కలెక్టర్ హిమాన్షు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్‌ నుంచి మోనిటరింగ్‌ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 25లక్షల క్యూసెక్కులు దాటిన గోదావరి.. మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  కాగా, ఇంతటి వరదను 1986 తర్వాత ఇంతటి వరద చూడలేదని లంక గ్రామ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంజనీరింగ్‌ విభాగాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
వరద ప్రభావం నేపథ్యంలో ఇంజనీరింగ్‌ విభాగాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గండ్లు పడే ప్రమాదం ఉన్న చోట అదనంగా సిబ్బందిని మెటీరియల్‌ని సమీకరించాలని ఆదేశించింది. ఏటీ గట్లను మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఏఈఈలు, ఇతర ఇంజనీరింగ్‌ సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top