నిర్లక్ష్యమే.. ప్రాణం తీస్తోంది..

5 Dead After Hit By Konark Express Train, Railway Accidents Precautions - Sakshi

సికింద్రాబాద్‌ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సోమవారం రాత్రి సిగడాం–చీపురుపల్లి సెక్షన్‌ బాతువ రైల్వే గేటు సమీపానికి వచ్చే సరికి ఎవరో చైను లాగడంతో ఆగిపోయింది. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు దిగి వెళ్తుండగా పక్క ట్రాక్‌పై అదే సమయంలో భువనేశ్వర్‌ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకుంటే నిండు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది.

దీనికి ఉదాహరణే సిగడాం–చీపురుపల్లి సెక్షన్‌లో జరిగిన రైలు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. సరైన కారణం లేకుండా చైన్‌ లాగకూడదు. రైల్వే ట్రాక్‌లు దాటకూడదు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వేసిన గేటు కింద నుంచి వెళ్లకూడదు. ఈ నిబంధనలు పాటించడంతో ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా.. నిండు ప్రాణాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి. 
– తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర)

రెల్వే ప్రమాదాలకు కారణం సరైన అవగాహన లేకపోవడమే. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొందరు అనవసరంగా.. ఏ కారణం లేకుండా అలారం చైన్‌ లాగుతుంటారు. కొన్ని సార్లు రైళ్లు ఏదైనా కారణాల వలన స్టేషన్‌లో కాకుండా మధ్యలో ఆగుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో ముఖ్యంగా జనరల్‌ ప్రయాణికులు రైలు దిగి, వేరే ట్రాక్‌లపైకి వెళ్లి కూర్చోవడం, ట్రాక్‌ల మీద తిరగడం చేస్తుంటారు. దీని వలన ఆ ట్రాక్‌పై వస్తున్న రైళ్లు గురించి తెలుసుకోలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్‌లో కాకుండా మధ్యలో ఆగినపుడు.. రైలు నుంచి దిగొద్దని అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.

కానీ ప్రయాణికులు ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. ఏ కారణం లేకుండా చైన్‌ లాగడం వలన రైలు ఆలస్యం కావడంతో పాటు.. వెనుక వచ్చే రైళ్లు కూడా ఆలస్యమవుతాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో చైన్‌ లాగడం వలన ప్రయాణికులు దోపిడీలకు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కారణం లేకుండా అలారం చైన్‌ లాగడం రైల్వే చట్టం 141 సెక్షన్‌ ప్రకారం శిక్షార్హమైన నేరం. అలా చేసిన వారికి రూ.1000 జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 

అజాగ్రత్త.. సరదా.. 
రైలు ప్రమాదాలకు ప్రజల అజాగ్రత్త కూడా ఒక కారణం. రైల్వే ట్రాక్‌లను ప్రజలు, ప్రయాణికులు ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. కొన్ని చోట్ల బహిర్భూమి కోసం.. కొందరైతే ఆటలాడుకునేందుకు.. మరికొందరు కాలకృత్యాలు తీర్చుకుంటుంటారు. ఈ విధంగా చేయడం ప్రమాదం అని తెలిసినా.. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌లను దాటుతుంటారు. మరికొందరు ట్రాక్‌లపై సెల్ఫీలు తీసుకుంటూ..చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. 

రైల్వే ట్రాక్‌ పరిసర ప్రాంత వాసులు ట్రాక్‌లను దాటేటప్పుడు, లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల వద్ద జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కొందరు ట్రాక్‌ల మీద నడుస్తూ ప్రయాణిస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పట్టాలు దాటుతున్న వలస కూలీలను గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అప్పట్లో తీవ్రంగా కలచివేసింది. 

స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు 
రైళ్లలో ప్రయాణించేటపుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. సరైన కారణం లేకుండా చైన్‌ లాగకూడదు. రైల్వే ట్రాక్‌లు దాటకూడదు. అలా చేయడం శిక్షార్హమైన నేరమని వాల్తేర్‌ డివిజన్, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అనూప్‌కుమార్‌ సత్పతి ప్రయాణికులను హెచ్చరించారు. డీఆర్‌ఎం ఆదేశాలతో మంగళవారం విశాఖపట్నం, విజయనగరం, దువ్వాడ, శ్రీకాకుళంరోడ్, జగదల్‌పూర్‌ వంటి స్టేషన్లలో బ్యానర్లు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఏ కారణం లేకుండా చైన్‌ లాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రత విషయమై వాల్తేర్‌ డివిజన్‌ అనేక చర్యలు చేపడుతోందని.. ప్రయాణికులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్‌ డివిజన్‌ భద్రత విభాగం, సెక్యూరిటీ, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

పయాణ సమయంలో.. 
స్టేషన్‌లో రైలు కదులుతున్నప్పుడు..ఎక్కడం, దిగడం చేస్తుంటారు. మరికొందరు తలుపు దగ్గర నిల్చొని.. కూర్చొని ప్రయాణిస్తుంటారు. ఇది కూడా ఎంతో ప్రమాదకరం. ఇటువంటి ప్రమాదమే మంగళవారం అనకాపల్లి జిల్లాలోని నరసింగబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య జరిగింది. రైలు నుంచి జారి పడి బావ, బావమరిది దుర్మరణం చెందారు. రైళ్లలో సురక్షితంగా ప్రయాణించి గమ్యం చేరుకునేందుకు వీలుగా రైల్వే అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలి. అత్యవసర సమయాల్లో రైల్వే భద్రతా దళం, గవర్నమెంట్‌ రైల్వే పోలీసుల సహా యం తీసుకోవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్‌ 139ను సంప్రదించవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top