అమర్‌నాథ్‌ యాత్ర: 35 మంది ఏపీవాసులు సురక్షితం.. ఇద్దరు గల్లంతు!

20 Amarnath pilgrims arrived safely to Andhra Pradesh - Sakshi

నందిగామ వాసులు సురక్షితం

రాజమహేంద్రికి చెందిన ఇద్దరు గల్లంతు

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి, నందిగామ/రాజమహేంద్రవరం, రాజంపేట: ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. మిగతావారిని సోమవారం ఉదయం రైలులో చండీగఢ్‌ నుంచి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఏపీ యాత్రికుల్ని గుర్తించాల్సి ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ భవన్‌ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శ్రీనగర్‌లోని టెంపుల్‌ బోర్డు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో చర్చిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ యాత్రికులు అంతా క్షేమంగా చేరుకునేలా చర్యలు చేపట్టారు. 

నందిగామ వాసులు సురక్షితం
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన ఎన్టీఆర్‌ జిల్లా వాసులు క్షేమంగా ఉన్నారు. జిల్లా నుంచి 35 మందితో కూడిన బృందం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లింది. వీరిలో చందర్లపాడు మండలానికి చెందిన అత్తలూరు సత్యనారాయణ, అత్తలూరి పార్వతమ్మ, అత్తలూరి అక్షయలింగ శర్మ, అత్తలూరి కనకదుర్గ, అత్తలూరి దశరథరామశర్మ, అత్తలూరి మంజు ఉన్నారు. వీరితోపాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన మరో 29 మందితో కలిపి మొత్తం 35 మంది కలిసి గత నెల 27న విజయవాడ నుంచి రైలులో బయలుదేరారు.

మార్గమధ్యంలో పలు క్షేత్రాలను దర్శించుకుని ఈ నెల 8న సాయంత్రం 3.30 గంటలకు అమరనాథుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో వరద విపత్తు నుంచి సురక్షితంగా బయటపడినా యాత్రికుల బృందం చెల్లాచెదురైంది. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తప్పిపోయిన వారంతా ఆదివారం ఉదయం శ్రీనగర్‌ చేరుకున్నారు.

అక్కడ నుంచి ఆర్మీ సిబ్బంది 35 మందిని ఒకే బస్సులో భద్రత కల్పించి రాత్రికి జమ్మూకు తరలించారు. వారంతా అక్కడి నుంచి చండీగఢ్‌  చేరుకుని రైలు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అమర్‌నాథ్‌ యాత్రికుడు వెంకటరమణ అనారోగ్యంతో గుడారంలో తల దాచుకున్నట్లు తెలిసింది. త్వరలో మిగతా యాత్రికులతో కలసి విమానంలో రానున్నట్లు తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇద్దరు రాజమహేంద్రి వాసులు గల్లంతు!
తూర్పు గోదావరి జిల్లా నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన 20 మందిలో ఇద్దరి అచూకీ మాత్రం తెలియరాలేదు. వారి జాడ కోసం ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన కొత్త పార్వతి, మునిశెట్టి సుధ ఆచూకీ తెలియలేదని చెప్పారు. ఫోన్లలో ఛార్జింగ్‌ లేకపోవడం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వారు ఎక్కడున్నారో గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి ఆచూకీ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఐఏఎస్‌ అధికారి ఏ.బాబు తెలిపారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన 867 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 

వెలగపూడి, ఢిల్లీలో హెల్ప్‌ లైన్‌ నంబర్లు 
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వెలగపూడి సచివాలయంలో 1902, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో 011–23384016 హెల్ప్‌ లైన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top