అక్రమార్జనలో ‘రాజు’

2 Engineers Devadaya Department Employee Caught In ACB Raids  - Sakshi

సాక్షి, అమరావతి/చిత్తూరు (కార్పొరేషన్‌)/విశాఖ దక్షిణం/శ్రీకాకుళం క్రైమ్‌/పార్వతీపురం టౌన్‌: అవినీతి నిరోధక శాఖ వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో సోమవారం ఇద్దరు ఇంజినీరింగ్‌ అధికారులు, మరో దేవదాయ శాఖ ఉద్యోగి పట్టుబడ్డారు. ఇందులో ఆదాయానికి మించి ఆస్తుల్ని కలిగి ఉన్న ఇద్దరితోపాటు లంచం తీసుకుంటుండగా ఒకరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు ఏసీబీ డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రుద్రరాజు రవిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఇందులో ఆదాయానికి మించి భారీగా ఆస్తులను గుర్తించారు. రూ.39.40 లక్షల నగదు, 3.87 కిలోల వెండి, బంగారం, వజ్రాలతోపాటు భవనాలు, ఖరీదైన కార్లు ఉన్నట్టు తేల్చారు. వీటితోపాటు భార్య, కుమార్తె, మరో వ్యక్తి పేరుపై లాకర్లు ఉన్నాయని, ఇంకా సోదాలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పార్వతీపురం ఏఈఈ తక్కువ తినలేదు పార్వతీపురం సబ్‌ డివిజన్‌ పంచాయతీరాజ్‌ విజిలెన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరమాచినేని సుధాకర్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

విశాఖపట్నం, విజయవా డలో రెండు ఫ్లాట్లు, విజయనగరం, విజయవాడలో మూడు ఖాళీ స్థలాలు, కృష్ణా జిల్లాలో ఆరుచోట్ల 8.06 ఎకరాల వ్యవసాయ భూమి, 719.33 గ్రాముల బంగారు నగలు, 2.39 కేజీల వెండి వస్తువులు, రూ.78,392 నగదు, బ్యాంకుల్లో రూ.20,30,552 డిపాజిట్లతో పాటు అత్తగారింట్లో నాలుగు లాకర్ల తాళాలను గుర్తించారు. పట్టుబడిన లంచగొండి గుంటూరులో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌)గా విధులు నిర్వహిస్తున్న మీనా వెంకటేశ్వరరావు న్యాయస్థానంలో ఉన్న ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం డిమాండ్‌ చేసి రూ.5 వేలు తీసుకున్నారు.

మరో రూ.5 వేలు ఇస్తేనే కౌంటర్‌ దాఖలు చేస్తానని బాధితుడిని ఇబ్బంది పెట్టడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం మీనా వెంకటేశ్వరరావు బాధితుడి నుంచి మరో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేసినట్టు డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు.

(చదవండి: దేవతల్లా యజ్ఞం చేస్తున్నాం.. రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top