- ఒక్కటై తప్పుడు కేసులు బనాయించిన టీడీపీ, కాంగ్రెస్
- వీటికి వంతపాడుతూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు
- నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు, టీడీపీ నుంచి జత కలుస్తూ ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు పిటిషన్లు
- మహా నేత వైఎస్సార్ జీవించి ఉండగా వైఎస్ జగన్ మంచోడు
- వైఎస్సార్ మరణించాక అవినీతి అంటూ అక్రమ కేసులతో వేధింపులు
- తప్పుడు ఆరోపణలతోనే జగన్‌పై కేసు వేసినట్లు వెల్లడించిన శంకర్‌రావు
సాక్షి, అమరావతి: పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై కుట్రపూరితంగా వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించాయి. ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదన్న కాంగ్రెస్‌తో తెర వెనుక జట్టుకట్టిన చంద్రబాబు తన వాళ్లు కూడా తప్పుడు కేసులు పెట్టేలా చక్రం తిప్పారు. రాజకీయంగా వైఎస్ జగన్‌ను అణగదొక్కాలన్న కాంగ్రెస్, చంద్రబాబు కుట్రలకు వంతపాడుతూ ఎల్లో మీడియా నిత్యం పచ్చి అబద్ధాలు, కట్టుకథలతో తప్పుడు రాతలు రాసింది.
మహానేత వైఎస్సార్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ అప్పటి అధినేత్రి సోనియా గాంధీకి, అధిష్ఠానానికి మంచివాడిలా కనిపించిన వైఎస్ జగన్.. వైఎస్సార్ హఠాత్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఆయన అభిమానులను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టడంతోనే నచ్చకుండాపోయారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు కేంద్రంలో చేతిలో ఉన్న అధికార దుర్వినియోగంతో, మరోవైపు టీడీపీతో కుమ్మక్కయి రాజకీయంగా దిగజారి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేసింది.
16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించింది. అయినా, వైఎస్ జగన్ వెరవలేదు. 2009 నుంచి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజల కోసం నిలిచారు. అధికారంలోకి వచ్చాక 2019–24 మధ్య జనం మెచ్చేలా సుపరిపాలన అందించారు. ఆత్మీయత.. విశ్వసనీయత.. దార్శనికత.. పారదర్శకత.. మానవీయత కలగలసిన ప్రజా నాయకుడిగా ఎదిగారు. దీంతో వైఎస్ జగన్‌పై మళ్లీ కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు.
గత నెల యూరప్ పర్యటనకు అనుమతిస్తూ కోర్టు సూచన మేరకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. కోర్టు అనుమతితో వైఎస్ జగన్ గత నెల యూరప్ పర్యటనకు వెళ్లారు. అనుమతి మంజూరు చేసే సమయంలో పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ నెల 14లోపు కోర్టు ఎదుట హాజరుకావాలని జడ్జి సూచించారు. నేరుగా హాజరైతే తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, ఆన్‌లైన్‌లో హాజరుకు అవకాశం ఇవ్వాలని జగన్ మెమో దాఖలు చేశారు.

16 నెలల అక్రమ నిర్బంధం అనంతరం విడుదలైన వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు (ఫైల్)
అయితే, నేరుగా హాజరుకావాలని నిర్ణయించుకుని ఆ మెమోను వెనక్కు తీసుకున్నారు. ఈ సందర్భంగా 21లోగా హాజరుకావాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గురువారం హాజరుకానున్నారు. దీనిపైన కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మద్యం, స్కిల్ డెవలప్‌మెంట్, తదితర కేసుల్లో బెయిల్‌పైన ఉన్న సీఎం చంద్రబాబే అసలు దోషి. బెయిల్‌పైన ఉండే చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు. దీన్ని విస్మరించి జగన్ లక్ష్యంగా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తుండటంపై రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.

ఓదార్పు యాత్రలో ఓ అవ్వ ఆత్మీయత(ఫైల్)
తప్పుడు కేసులేనని అంగీకరించిన శంకర్‌రావు, ఆజాద్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అణగదొక్కేందుకు చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం... తమ ఎమ్మెల్యే శంకర్‌రావు ద్వారా తప్పుడు ఆరోపణలతో హైకోర్టులో కేసు వేయించింది. దీనికి టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు జత కలుస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కుమ్మక్కు కొంతకాలం తర్వాత కాంగ్రెస్ నేతల మాటల్లోనే స్పష్టమైంది. ‘‘వైఎస్ జగన్‌ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు.
నేను చేశానంతే’’ అని శంకర్‌రావు, ‘‘రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం’’ అని కాంగ్రెస్ మాజీ అగ్ర నేత గులాం నబీ అజాద్ వేర్వేరు సందర్భాల్లో మీడియా ఎదుట కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, సోనియా మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారని స్పష్టం చేయడం గమనార్హం. ఇలా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అణగదొక్కేందుకు దశాబ్దంన్నర కిందట చేసిన కుట్రలను నేటికీ టీడీపీ, ఎల్లోమీడియా కొనసాగిస్తుండడం గమనార్హం.
‘‘వైఎస్ జగన్‌ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు. నేను చేశానంతే’’
-కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు బతికుండగా పలుమార్లు చేసిన వ్యాఖ్యలు ఇవీ...
‘‘రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం. సోనియా గాంధీ మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారు’
- ఇవీ కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు


