డిగ్రీలో సింగిల్‌ మేజరే! | 126 credits designed for three year degree courses | Sakshi
Sakshi News home page

డిగ్రీలో సింగిల్‌ మేజరే!

Jul 18 2025 5:35 AM | Updated on Jul 18 2025 5:35 AM

126 credits designed for three year degree courses

మరో మేజర్‌ ఆప్షనల్‌ మాత్రమే మైనర్‌ కోర్సు తప్పనిసరి

ఇంటర్న్‌షిప్‌ క్రెడిట్లు తీవ్రంగా కుదింపు

మూడో సెమిస్టర్‌ వరకు లాంగ్వేజ్‌లు పొడిగింపు

మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో 126 క్రెడిట్లు రూపకల్పన

డ్యూయల్‌ మేజర్‌ ప్రతిపాదనపై దోబూచులాడిన ప్రభుత్వం

స్వల్ప మార్పులతో చివరికి సింగిల్‌ మేజర్‌ వైపే మొగ్గు

ఈ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాలు

డ్యుయల్‌ మేజర్‌ అమలు చేయాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. సింగిల్‌ మేజర్‌ విధానాన్ని మార్పు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించి నాలుక కర్చుకున్నట్టు అయ్యింది. ప్రభుత్వ ప్రకటనతో ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిటీని నియమించి డ్యూయల్‌ మేజర్‌ కోర్సులను ప్రతిపాదించింది. ఈ మేరకు కళాశాలలకు కోర్సుల కన్వర్షన్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చింది. 

సుమారు 1219 కళాశాలల్లో 1205 కళాశాలలు డ్యూయల్‌ మేజర్‌కు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే వీటికి డ్యూయల్‌ మేజర్‌ అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వం తాత్సారం చేసింది. మళ్లీ సింగిల్‌ మేజర్‌నే కొనసాగించేలా పాత పద్ధతికి స్వల్ప మార్పులు చేసి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలికి లేఖ రాసింది.

మూడేళ్ల డిగ్రీకి 126 క్రెడిట్లు..
తాజాగా ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం మూడేళ్ల డిగ్రీకి 126 క్రెడిట్లు కేటాయించింది. ఇందులో లాంగ్వేజెస్‌ను మూడో సెమిస్టర్‌ వరకు పొడిగించినట్టు తెలుస్తోంది. ఉద్యోగ, ఉపాధి కల్పనలో మార్కెట్‌ ఓరియంటెడ్‌ విధానాన్ని అలవర్చే ఇంటర్న్‌ షిప్‌ను తగ్గించినట్టు సమాచారం. పేరుకు రెండు మేజర్‌ సబ్జెక్టులు చూపించినప్పటికీ అందులో ఒకటి ఆప్షనల్‌ కావడం, వాటికి కేవలం 16 క్రెడిట్లు మాత్రమే కేటాయించింది. ఇలా చేయడంతో పీజీ చేసుకునే అవకాశం ఉండదు. ఇక మేజర్‌ కోర్‌ సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్నే ఆప్షనల్‌ మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ డిగ్రీ ప్రవేశాలు
రాష్ట్రంలో సాంప్రదాయ డిగ్రీ విద్య ప్రవేశాల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆన్‌లైన్‌ (ఓఏఎండీసీ)తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. బుధవారం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ పేరుతో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని బయట పెట్టకుండా రహస్యంగా ఉంచారు. ఓఏఎండీసీ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలోనూ, అలాగే ఎంచుకున్న కళాశాలను నేరుగా సంప్రదించి ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

కళాశాలలో విద్యార్థి దరఖాస్తు సమర్పించే సమయంలో కచ్చితంగా ఆధార్‌ అథంటిఫికేషన్‌ తీసుకోవాలని సూచించింది. ఎలా దరఖాస్తు చేసినప్పటికీ మెరిట్‌ ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయించనున్నట్టు ప్రకటించింది. వీటిల్లో గ్రూప్‌ 1 (12 కులాలు)కు 1శాతం, గ్రూప్‌ 2(18కులాలు)6.5శాతం, గ్రూప్‌3 (29కులాలు)కు 7.5శాతం గా విభజించింది.  

మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే..
2025–26 విద్యా సంవత్సరం డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా డ్యూయల్‌ మేజర్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో చాలా కళాశాలలు ఆ దిశగా సన్నద్ధమయ్యాయి. ఇంతలో ప్రభుత్వం మనసు మార్చుకోవడంతో చిక్కుల్లో పడ్డాయి. తాజా ప్రతిపాదన ప్రకారం మళ్లీ సింగిల్‌ మేజర్‌ విధానానికి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. కళాశాలలు వాటికి అనుమతి పొందిన తర్వాతే ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఈ ప్రక్రియకు దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. 

కానీ, కళాశాలలు ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా మేజర్‌–కోర్, మేజర్‌–ఎలక్టీవ్‌ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి తోడు ఆన్‌లైన్‌ ప్రవేశాలకు స్వస్తి పలికే యోచనలో ప్రభుత్వం ఉండగా అధికారికంగా ఉత్తర్వులు మాత్రం ఇవ్వడం లేదు. గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యా సంస్థకు చెందిన అధిపతి ప్రభావంతో డిగ్రీ ప్రవేశాలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రలోభాలకు లోనవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మేజర్‌కు సగం క్రెడిట్లు ఉండాల్సిందే!
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం డిగ్రీలోని మొత్తం క్రెడిట్లలో మేజర్‌ సబ్జెక్టుకు సగం క్రెడిట్లు కేటాయించాలి. గత ప్రభుత్వం ప్రతిపాదించిన సింగిల్‌ మేజర్‌కు 60, సింగిల్‌ మైనర్‌కు 24 క్రెడిట్లు పొందుపరిచింది. కానీ, కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన మేజర్‌–కోర్‌ సబ్జెక్టుకు కేవలం 44 క్రెడిట్లు మాత్రమే ఇచ్చింది. మేజర్‌ ఆప్షనల్‌కు 16 క్రెడిట్లు కేటాయించింది. దీంతో యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా క్రెడిట్లు ఎలా కేటాయించారనేది ప్రశ్నార్థంగా మారింది. 

ఇటీవల ఉన్నత విద్యా మండలి డ్యూయల్‌ మేజర్‌ను ప్రతిపాదించినప్పుడు మేజర్‌ 1కు 48, మేజర్‌ 2కు 32 క్రెడిట్లు ఇస్తే యూ­జీసీ నిబంధనలకు ఇవి విరుద్ధమని ఉన్నత విద్యాశాఖ అధికారులు వాదించినట్టు సమాచారం. ఇప్పుడు అదే ఉన్నత వి­ద్యాశాఖ అధికారులు తాజా ప్రతిపాదనల్లో మేజర్‌ సబ్జెక్టు క్రెడిట్ల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థంకాని పరిస్థితి.

రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
వేంపల్లె/నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో రెండో విడత జరిగిన అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినట్లు ట్రిపుల్‌ ఐటీ పరిపాలన అధికారి డాక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలోని సెంట్రల్‌ లైబ్రరీలో మిగిలిపోయిన సీట్లకు గురువారం రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టారు. 

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి 91 సీట్లకు 60 మంది విద్యార్థులు హాజరై అడ్మిషన్లు పొందారు. మిగిలిన సీట్లకు త్వరలో విద్యార్థుల జాబితాను విడుదల చేస్తామని రవికుమార్‌ తెలిపారు. రెండో విడతలో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో అనంతపురానికి చెందిన సనత్‌ కుమార్‌ పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో మొదటి అడ్మిషన్‌ పొందాడు.

557 మందికి ప్రవేశాలు...
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో రెండో విడత కౌన్సెలింగ్‌లో 557మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ అనంతరం నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో మిగిలిన సీట్లతో పాటు పీహెచ్‌సీ, సీఏపీ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా కింద గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌కు 807మంది అభ్యర్థులను ఆహ్వానించగా వారిలో 557 మందికి ప్రవేశాలు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement