రాయదుర్గం: నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో సతమతమవుతున్న పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తాజా ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. మరోవైపు శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ జోరందుకుంది. మార్కెట్‌కు వెళ్లి ధరలు చూసిన వినియోగదారులు ‘ఇంత పెరిగాయేంటి’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. గత వారంతో పోల్చుకుంటే కిలో చక్కెర హోల్ సేల్‌లో రూ.42 ఉండగా, ప్రస్తుతం రూ.72కి చేరింది. కిరాణా కొట్టులో బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, ఆయిల్ ఇలా ఏది కొనాలన్నా ధరలు బెంబే లెత్తిస్తున్నాయి. 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.1800కు చేరింది. ఎల్–నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులను సాకుగా చూపుతూ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. గత నెలలో రూ.145 ఉన్న పామాయిల్ ప్యాకెట్ ధర ఇప్పుడు రూ.155కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.180 నుంచి రూ.200 వరకు పెరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎక్కువ శాతం తీపి వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పంచదార (చక్కెర) ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నలుగురు సభ్యులున్న కుటుంబం నెల ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే బియ్యంపై రూ.200 నుంచి రూ.400, పప్పులపై రూ.100 నుంచి రూ.300 వరకు అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఇక కూరగాయల ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి మొదలు వెల్లుల్లి, టమాట, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, ఆఖరికి కాకర వరకు కిలో రూ.40 పైమాటే. ఉల్లి అయితే మరింత ఘాటెక్కి కిలో రూ.70కి చేరింది. ఈ లెక్కన నెలకు రూ.2వేల వరకు భారం పెరిగింది. గ్యాస్, పెట్రోల్ కలిపి లెక్కిస్తే నెలకు చిన్న కుటుంబమైనా రూ.3 వేలు ఖర్చులు అదనంగా వస్తున్నాయి.
అదనపు భారం రూ.290.44 కోట్లకు పైనే..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 40,81,148 జనాభా, 9,68,160 కుటుంబాలు ఉన్నాయి. పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా సగటున ప్రతి కుటుంబంపై రూ.3 వేల చొప్పున అదనపు బడ్జెట్ లెక్కిస్తే రూ.290.44 కోట్ల భారం పడనుంది. జిల్లాలో స్వీట్ బేకరీ నిర్వాహకులు 3 వేల మందికి పైగా ఉంటారు. స్వీట్ల తయారీకి ఎక్కువ భాగం పంచదార వినియోగిస్తారు. రోజూ వంద క్వింటాళ్లకు తక్కువ కాకుండా ఈ బేకరీల్లో చక్కెర పాకం పడుతారు. కిలో రూ.42 నుంచి రూ.72 అంటే రూ.30 అదనంగా పెరిగింది. ఈ లెక్కన వంద క్వింటాళ్ల వినియోగానికి రూ.3 లక్షలు భారం మోయాల్సి వస్తోందని బేకరీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బెల్లం ధరలు కూడా నియంత్రణలోకి రావడం లేదు.
చేదెక్కిన చక్కెర..
ఘాటెక్కిన ఉల్లి
మండిపోతున్న నిత్యావసర ధరలు
తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్
25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.1800
వంట నూనె ప్యాకెట్ రూ.155,
ఇతర వస్తువులదీ అదేదారి
కూరగాయల రేట్లు కూడా అంతే..
సామాన్య, మధ్య తరగతి ప్రజల
బెంబేలు
నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. జిల్లా స్థాయిలోనూ ధరల నియంత్రణ కమిటీ ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై సమీక్ష జరపాలి. కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా జేసీ, కన్వీనర్‌గా జిల్లా పౌరసరఫరాల అధికారి ఉంటారు. సభ్యులుగా తూనికలు, కొలతలు, మార్కెటింగ్, రవాణాశాఖ అధికారి ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ వ్యాపారులు బియ్యం, పప్పులు, నూనె, పంచదార, బెల్లం ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు అమాంతం పెంచేస్తూ నడ్డి విరుస్తున్నా ధరల నియంత్రణపై ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని సామాన్యులు పెదవి విరుస్తున్నారు.
ధరల
నియంత్రణ
ఏదీ?


