17 ఏళ్లుగా ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాళ్లే దిక్కు! | - | Sakshi
Sakshi News home page

17 ఏళ్లుగా ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాళ్లే దిక్కు!

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలకు 17 ఏళ్లుగా ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాళ్లే దిక్కుగా మారారు. నేటికీ ప్రభుత్వం ప్రిన్సిపాల్‌ పోస్టులను మంజూరు చేయలేదు. రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో ఆ కళాశాలల నిర్వహణ అంతంతగానే మారింది.

2008లో ఏర్పాటు..

అనంతపురం, మడకశిరలో రెండు ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. 2008లో ఇవి ఏర్పాటయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆ కళాశాలలకు ప్రిన్సిపాల్‌ పోస్టులు మంజూరు కాలేదు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. దీంతో కళాశాలల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలున్నాయి. ప్రిన్సిపాల్‌ పోస్టులను మంజూరు చేయాలని అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు కోరుతున్నా... పాలకులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

కోర్సులకు పెరుగుతున్న ఆదరణ..

జిల్లాలో ఒకేషనల్‌ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ప్రధానంగా ఒకేషనల్‌ కోర్సులను పూర్తి చేసుకుని చాలా మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఒకేషనల్‌ కళాశాలల్లో ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డీటీ, సెరికల్చర్‌, సీటీ, ఈటీ, ఈఈటీ, ఎఫ్‌జీఎం, ఎంఅండ్‌ ఏటీ, బీఅండ్‌ ఆర్‌ఎం, సీఎస్‌ తదితర కోర్సులను నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో ఈకోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దీంతో ఈకోర్సులకు డిమాండ్‌ నెలకొంది. మడకశిర ఒకేషనల్‌ కళాశాలలో 11 కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మడకశిర కళాశాలలోనే దాదాపు 550 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారు.

25 ఒకేషనల్‌ కళాశాలలు మంజూరు..

2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ఉన్నప్పుడు 25 ఒకేషనల్‌ కళాశాలలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఏపీలో 12 ఒకేషనల్‌ కళాశాలలు ఉన్నాయి. మడకశిర, అనంతపురంలోని కళాశాలలు కూడా వైఎస్సార్‌ హయాంలో మంజూరైనవే. స్వయం ఉపాధి కల్పించడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చి కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈకళాశాలల్లో రెండేళ్ల కోర్సులను పూర్తి చేసుకున్న అనేక మంది విద్యార్థులు స్వయం ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈకళాశాలల నిర్వహణను గాలికొదిలేసింది. ప్రిన్సిపాల్‌ పోస్టులను మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ కూడా ప్రిన్సిపాల్‌ పోస్టుల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తుండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఒకేషనల్‌ కళాశాలలకు ప్రిన్సిపాల్‌ పోస్టులను మంజూరు చేసి విద్యాభివృద్ధికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కళాశాలల్లో విద్యాప్రమాణాలు తగ్గి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

నేటికీ ఒకేషనల్‌ కళాశాలలకు

మంజూరు కాని ప్రిన్సిపాల్‌ పోస్టులు

2008లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రెండు కళాశాలలు మంజూరు

ప్రిన్సిపాల్‌ పోస్టుల మంజూరును

పట్టించుకోని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement