అనంతపురం అర్బన్: రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. అలాగే భూసమస్యలకు సంబంధించిన అర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు.
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
ఉరవకొండ: రాయంపల్లిలో నెరమెట్ల, రాయంపల్లి, వ్యాసాపురం గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం పర్వతేశ్వరస్వామి ఆలయం ఎదురుగా 18 అడుగుల శివలింగం, నందీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఉదయం గోపూజ, హోమాలు, ప్రత్యేక అభిషేకాలు తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివలింగం, నందీశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మహాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, పాల్తూరు కల్లుహోళ్ల మఠం పీఠాధిపతులు చెన్నవీరశివాచార్య మహాస్వామి, కొక్కరచేడు గురుసేవాశ్రమం గురుచరణానందగిరి మాతాజీల అధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి
బెళుగుప్ప: అతివేగంగా ఆర్టీసీ బస్సు నడుపుతున్నాడంటూ డ్రైవర్‌పై ఓ ద్విచక్రవాహనదారుడు దాడికి పాల్పడ్డాడు. ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం విరుపాపల్లి మీదుగా వెళ్తోంది. ఆ వెనకే ఓ వ్యక్తి బైకుపై వేగంగా వచ్చి బస్సును ఆపాడు. బస్సును ఎందుకు అతివేగంగా తోలుతున్నావంటూ అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా దాడికి పాల్పడ్డాడు. కండక్టర్ లలిత, ప్రయాణికులు సర్దిచెప్తున్నా వినలేదు. అనంతరం డ్రైవర్ బస్సును నేరుగా బెళుగుప్ప పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. తనపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశాడు.
హంద్రీ–నీవా కాలువలోకి
దూకిన దంపతులు
● భార్య మృతి.. భర్త గల్లంతు
గుంతకల్లుటౌన్: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు హంద్రీ–నీవా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో భార్య మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన భర్త కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు... కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెలడోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ (60), సీతానంద(64) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు కుమారుడు నారాయణ వద్ద ఉంటున్నారు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుంతకల్లులో ఆస్పత్రికి వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన వీరు బస్సులో కసాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ వద్దకు వెళ్లి నీటిలో దూకారు. నీటిలో తేలియాడుతున్న సోమలింగమ్మను స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నీటిలో గల్లంతైన సీతానంద కోసం గాలింపు చేపట్టారు. దంపతులు అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కసాపురం ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.


