కష్టమైనా నష్టమైనా రైతు కోసం వెన్నుచూపేది ఉండదని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019–2024 మధ్య కాలంలో అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేశారు. ‘కరోనా’ మహమ్మారి విలయతాండవం చేస్తున్న అత్యంత విపత్కర పరిస్థితుల్లోనూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి అసలుసిసలైన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం రెండేళ్లుగా సకాలంలో విత్తనం ఇవ్వకుండా, అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచకుండా కష్టనష్టాలకు గురిచేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్: 2020 మార్చిలో కరోనావిజృంభించినా ఖరీఫ్‌లో రైతులు ఇబ్బంది పడకుండా ఏప్రిల్‌లోనే ముందస్తుగా విత్తనాలు, ఎరువుల సరఫరాకు అప్పటి జగన్ సర్కారు చర్యలు చేపట్టింది. ‘మన విత్తనం–మంచి విత్తనం’ నినాదంతో రబీలో రైతులు పండించిన వేరుశనగకు మద్ధతు ధర ఇచ్చి ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖ ద్వారా విత్తన సేకరణ చేయించారు. గ్రామ గ్రామాన తిరిగి రైతుల నుంచి నాణ్యమైన విత్తనం సేకరించి ప్రాసెసింగ్ ప్లాంట్లలో శుద్ధి చేసి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నిర్మించిన సచివాలయాలు, వాటికి అనుబంధంగా ఉన్న 867 ఆర్‌బీకేలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రూ.275 కోట్ల విలువ చేసే 3.44 లక్షల క్వింటాళ్ల మేర విత్తన వేరుశనగ, కందులు గ్రామాల్లోనే రైతుల ముంగిటకు చేర్చారు. మే 17న విత్తన పంపిణీ మొదలు పెట్టి జూన్ మొదటి వారంలోగా పూర్తి చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 120 కిలోలు అందించారు. 40 శాతం మేర రాయితీ రూపంలో రైతులకు రూ.110 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.
‘కరోనా’ విపత్తులోనూ విత్తుకోసం రూ.275 కోట్లు ఇచ్చిన జగన్ సర్కారు
మన విత్తనం–మంచి విత్తనం పేరుతో ముందస్తుగా నాణ్యమైన విత్తనం
సకాలంలో 3.44 లక్షల క్వింటాళ్ల
వేరుశనగ, 6 వేల క్వింటాళ్ల కందులు
నేడు 50 వేల క్వింటాళ్లు కూడా ఇవ్వకుండా చేతులెత్తేస్తున్న చంద్రబాబు
చంద్రబాబు హయాంలో కష్టాలు
నేడు
అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా రైతు సంక్షేమానికి చంద్రబాబు సర్కారు కంటితుడుపు చర్యలు మినహా పెద్దగా సాయం చేసింది లేదు. ఖరీఫ్, రబీలో రైతులకు విత్తనం కూడా ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు. 2025 ఖరీఫ్‌లో అరకొరగా రాయితీ వేరుశనగ ఇచ్చారు. 2025 రబీలో అయితే 2 వేల క్వింటాళ్లు మాత్రమే రాయితీ పప్పుశనగ అందించారు. ఈ ఖరీఫ్‌లో విత్తన వేరుశనగ, ఇతర విత్తనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనం కేటాయించినా, సరఫరా చేసింది మాత్రం 35 వేల క్వింటాళ్లు.. రైతులకు పంపిణీ చేసింది 15 వేల క్వింటాళ్లే కావడం గమనార్హం. గత ఖరీఫ్, రబీకి సంబంధించి సరఫరాదారులకు బకాయిలు చెల్లించకపోవడంతో విత్తన కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 50 వేల క్వింటాళ్లు కూడా పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన రాయితీ రూపంలో చంద్రబాబు సర్కారు రైతులకు రూ.20 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.


