పుట్లూరు: మండలంలోని అకటివేముల వద్ద సోమవారం ట్రాక్టర్, బైకు ఢీకొన్న ఘటనలో తాడిపత్రికి చెందిన జాఫర్ (19) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన జాఫర్ తన స్నేహితులు జితేందర్‌రెడ్డి, భరత్ రాజుతో కలిసి నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి దర్శనానికి బైకుపై వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో అరకటివేములలోని మలుపు వద్ద ఎదురుగా ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రగాయాలైన జాఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జితేందర్‌రెడ్డి, భరత్ రాజుకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మామిళ్లపల్లి వద్ద యువకుడు..
కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. తగరకుంట గ్రామానికి చెందిన నాగన్న, ఉమాక్క దంపతుల కుమారుడు బిల్లే మహేష్ (21), అతని మామ పెన్నప్ప, అత్త శ్రావణిలు చెన్నేకొత్తపల్లిలోని వారి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లి వస్తుండగా, రాత్రి వేళ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి 108 ద్వారా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్తుండగా, మహేష్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. గాయపడ్డ పెన్నప్ప, శ్రావణిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు నాగన్న, ఉమాక్క, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటోను ఢీకొని మెకానిక్..
గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరులో ఆటోను బైకు ఢీకొన్న ఘటనలో ఓ బైక్ మెకానిక్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామానికి చెందిన వీరన్న, ఆదెమ్మ దంపతుల కుమారుడు మహేష్ బాబు (37) బైక్ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సోమవారం బైక్ సామాన్ల కోసం ద్విచక్ర వాహనంలో అనంతపురం బయలుదేరాడు. మార్గమధ్యంలోని కల్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్‌ఐ వెంకటేషులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సాయం చేసేందుకు వెళ్తే ప్రాణమే పోయింది
నార్పల: సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యు వాత పడిన ఘటన మండల పరిధిలోని నాయనపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం తెల్లవారుజామున పుట్లూరు మండలంలోని కొండాపురంలో రేణప్పకు చెందిన ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. అనంతపురం వైపు తీసుకెళ్లాడు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన రేణప్ప వెంటనే ఆ మార్గంలోని వెంకటాంపల్లికి చెందిన తన బంధువు బాలరాజుకి ఫోన్ చేసి దొంగను అడ్డుకోవాలని సూచించాడు. అప్రమత్తమైన బాలరాజు (45) వెంటనే తన కుమారుడు ప్రవీణ్‌తో కలిసి నాయనపల్లికి చేరుకుని మెయిన్ రోడ్డుపై ట్రాక్టర్‌ను ఆపేందుకు యత్నించాడు. అయితే, ట్రాక్టర్ దొంగ ఆపకుండా ఢీకొనడంతో తీవ్ర గాయాలైన బాలరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దొంగిలించిన వ్యక్తి ట్రాక్టర్‌ను వదిలి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలరాజు కూలీ పనులు చేసుకుని జీవించేవాడని, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రహదారులు
రక్తమోడాయి. వేర్వేరు ఘటనల్లో
నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కుటుంబీకులకు తీరని వేదన మిగిల్చారు.


