అనంతపురం అర్బన్: చేనేతల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని చేనేత కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. చేనేతల సమస్యలు పరిష్కరించాలంటూ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, నేతన్నలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీరాములు, పామిశెట్టి గోవిందు మాట్లాడారు. చేనేతలకు ఇచ్చిన హామీలు, సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం వందశాతం విఫలమయ్యిందని దుమ్మెత్తిపోశారు. నేతన్న నేస్తం రూ.25 వేలు తక్షణం అమలు చేయాలన్నారు. నేతన్నకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు చేయాలన్నారు. ఎన్‌హెచ్‌డీసీ యార్న్ సబ్సిడీ డిపోలను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు మూడు సెంట్ల స్థలంతో పాటు పక్కా గృహం, వర్క్ షెడ్‌లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలన్నారు. వయసు 50 ఏళ్లు నిండి చేనేత గుర్తింపు కార్డు ఉన్న భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో నెలకు రూ.5 వేల ప్రకారం 6 నెలలు పాటు అందించాలని డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలూరి లక్ష్మయ్య, నాయకులు నరసింహులు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
జీతాలు వెంటనే చెల్లించాలి
అనంతపురం న్యూటౌన్: తమకు రావాల్సిన నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులు బోర్డు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు కార్మికులకు చెల్లించాల్సిన రూ. 2.5 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోర్డ్ అకౌంట్లో నిధులు ఉన్నా కార్మికులకు జీతాలు చెల్లించకుండా బోర్డు మెంబర్ సెక్రటరీ, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సమర్థనీయం కాదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే జూలై 6న బోర్డు ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్, సెక్రటరీ శ్రీరాములు, ట్రెజరర్ వన్నూరప్ప, వీరాంజనేయులు, వెంకటేశులు, చిన్న బాబయ్య, రవీంద్ర చారి, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.


