ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

గుత్తి రూరల్‌: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుత్తి మండలం యంగన్నపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ జిల్లా సారా గ్రామానికి చెందిన మున్నా కుమారుడు అమన్‌ (20) అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. సదరు యువతి ప్రేమకు నిరాకరించడంతో ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. కుమారుడిని మార్చాలని భావించిన తల్లిదండ్రులు గుత్తి మండలంలోని బేతాపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న సోలార్‌ ప్లాంటులో ఓ కాంట్రాక్టర్‌ వద్దకు కూలీ పనులకు పంపారు. అమన్‌తో పాటు ఇతర కూలీలు నివాసం ఉండేందుకు కాంట్రాక్టర్‌ చెట్నేపల్లిలో ఓ ఇల్లు చూపించాడు. అమన్‌ కూలీ పనులకు వెళ్లినా అక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే ఉండేవాడు. తాను చనిపోతానని రోజూ తోటి కూలీలతో చెప్పేవాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి యంగన్నపల్లి శివారులోని బాలరాజు మామిడి తోటలో తన షర్ట్‌తో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి విచారించారు. ప్యాంటు జేబులో ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా మృతుడు యూిపీకి చెందిన అమన్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించారు.

వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

హిందూపురం: హిందూపురం రైల్వేస్టేషన్‌లో కోయంబత్తూరుకు చెందిన వృద్ధురాలు నాగలక్ష్మి మెడలోని 2.50 తులాల బంగారు గొలుసును దొంగ లాక్కుపోయాడు. కోయంబత్తూర్‌ నుంచి హిందూపురం తూమకుంట వద్ద పెళ్లికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి నాగలక్ష్మి కుటుంబసభ్యులు వచ్చారు. రైలు దిగి మిగిలిన వారు కాస్త ముందు వైపు నడుస్తుండగా వృద్ధురాలు నిదానంగా వెళ్తోంది. గమనించిన దొంగ ఆమె మెడలోని గొలుసును లాక్కుని రైలెక్కి పరారయ్యాడు. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారని రైల్వేస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎర్రిస్వామి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement