అన్నదాత ఆక్రందనలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆక్రందనలు పట్టవా?

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

అనంతపురం : వ్యవసాయంలో నష్టాలు.. అరకొరగా పండిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రమూ పట్టడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి సోమవారం కలెక్టర్‌ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పుట్లూరు మండలం ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగమయ్య, మడుగుపల్లిలో రైతు చంద్రమోహన్‌, నార్పల మండల కేంద్రంలో రైతు ఆదినారాయణ అప్పులు బాధ తాళలేక తనువులు చాలించారన్నారు. పంట ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడంతో పెట్టుబడులు తిరిగిరాక అప్పుల పాలవుతున్నారన్నారు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మడంపై ఉన్న శ్రద్ధ పంటలకు మంచి ధర కల్పించి రైతులను ఆదుకోవడంలో ఎందుకు చూపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమలకు ఎకరా భూమిని 99 పైసలకే ధారాదత్తం చేస్తారు కానీ రైతుల గురించి ఎందుకు ఆలోచించరని సూటిగా ప్రశ్నించారు. రైతులను రాజకీయాలకతీతంగా చూడాలని, వ్యవసాయ సంక్షోభ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు చేయాలని, పంటల బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు వంశీ గోకులరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, నాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌ నాయక్‌, పార్టీ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పరంధామరెడ్డి, ఎల్లారెడ్డి, పద్మావతి, బయపరెడ్డి, శివశంకర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, బోనాల హరికృష్ణ, భాస్కర్‌రెడ్డి, వెంకటరాముడు, మధుసూదన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, కాటమయ్య, రంగనాథ్‌, రేవంత్‌రెడ్డి, ఎల్లుట్ల శేఖర్‌, పవన్‌ కుమార్‌, శ్రీనివాసరెడ్డి, బయన్న, జయరామిరెడ్డి పాల్గొన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించడం అత్యంత దురదృష్టకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను సాధారణ ఘటనలుగా చూడకూడదన్నారు. బాధిత రైతు కుటుంబానికి తక్షణ ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్టుషాపులను విచ్చలవిడిగా నిర్వహిస్తూ ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.50 నుంచి రూ.60 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. కానీ రైతు పండించిన పంటను మాత్రం కొనుగోలు చేయడానికి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. మొక్కజొన్నకు క్వింటాలు రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే రూ.1400కు కూడా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కార్పొరేట్‌ కంపెనీలకు ఎకరా 99 పైసలకే ధారాదత్తం చేస్తోందని, మరి రైతుల శ్రేయస్సును ఎందుకు విస్మరిస్తోందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం విఫలం

పంటలకు గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతులు

మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, మాజీ ఎంపీ తలారి రంగయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement