ఉత్సాహంగా ఐదో సరిగెత్తు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఐదో సరిగెత్తు

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు భక్తుల కోలాహలం మధ్య ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం ఐదో సరిగెత్తులో భాగంగా పీర్ల చావిడిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆలయం ముందు కోలాటం, ఆటపాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో ఈఓ శోభారాణి, శ్రీదేవి, నాగార్జున, భక్తులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా మద్యం.. జూదం

నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలనుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇదే అదనుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోంది. బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు జూదం, పేకాట నిర్వహణ జోరందుకుంది. సులువుగా డబ్బు సంపాదించ వచ్చంటూ యువతకు గాలం వేస్తున్నారు. ఉత్సవాల వేళ భక్తితో స్వామివారిని దర్శించుకుందామని వచ్చిన భక్తులు ఆశకు పోయి జూదంలో డబ్బు కోల్పోయి ఉసూరుమంటున్నారు. దేవదాయ, పోలీసు, ఎకై ్సజ్‌ శాఖ అధికారులు స్పందించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు.

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌

పదవీకాలం పొడిగింపు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో గత నెల 26న ఏడాది కాలం పూర్తి చేసుకున్న ముంటిమడుగు కేశవరెడ్డి మరో ఆరు నెలల పాటు డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా కొనసాగనన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

తుంగభద్ర జలాశయానికి జీరో ఇన్‌ఫ్లో

బొమ్మనహాళ్‌: జిల్లాకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఎగువ భాగంలో నుంచి అడపాదడపా వస్తున్న వరద నీటి ఇన్‌ఫ్లో ఆదివారం ఉదయం జీరో స్థాయికి పడిపోయింది. ఎల్‌–నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతువపనాలు ప్రవేశించి రోజులు గడుస్తున్నా ఎగువ భాగంలోని శృంగేరి, వరనాడు, అగుంబే, శివమొగ్గ, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో టీబీ డ్యాంకు వరద రావడం లేదు.

డ్యాంలో 9.71 టీఎంసీల నీటి నిల్వ

తుంగభద్ర డ్యాంలో సోమవారం నాటికి 9.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 30,594 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లోతో 44.46 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. సాగు–తాగునీటి కోసం తుంగభద్ర జలాలపై ఆధారపడిన రైతులు, ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

మొక్కజొన్న వ్యాపారి అరెస్ట్‌

యాడికి: రైతులనుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి ఇండ్ల సంతోష్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం యాడికి మండలం రాయలచెరువు, తూట్రాళ్లపల్లి రైతుల వద్ద సంతోష్‌కుమార్‌ మొక్కజొన్న కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా పరారయ్యాడు. రైతుల ఫిర్యాదు మేరకు యాడికి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో వ్యాపారిని యాడికి పోలీసులు సోమవారం అరెస్టు చేసి, తాడిపత్రి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉండగా సదరు వ్యాపారిపై బనగానపల్లి, హైదరాబాద్‌, అనంతపురం, వెలుగోడు ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

కారులో మంటలు

పుట్టపర్తి టౌన్‌: పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కారులో మంటలు చెలరేగాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం సోమవారం కారులో ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రి వద్ద నిలిపిన కారులో నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement