అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ చాలా మంది డీడీలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా ప్రాథమిక పరిశీలన, బిల్ ఆఫ్ క్వాంటిటీ(బీవోక్యూ),బెంచ్‌మార్క్‌సర్వే (బీఎంసీ), ఇతరత్రా డాక్యుమెంటేషన్ అంటూ జాప్యం చేస్తుండటంతో పరికరాల పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఎల్–నినో హెచ్చరికలు జారీ కావడం, భూగర్భజలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటివనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను కాపాడుకోవాలనే ఆత్రుతలో అన్నదాతలు ఉన్నా చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర పోతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాదివి పెండింగ్..
గతేడాది(2025–26)కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 18,180 మంది రైతులకు 23,356 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు మంజూరు చేశారు. ఈ రైతులందరూ తమ వాటా కింద డిజిటల్ పద్ధతిలో డీడీలు చెల్లించారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. 2026–27 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా ఇంకా 5 వేల మంది రైతులకు పరికరాలు అందని పరిస్థితి నెలకొంది. 22 వేల హెక్టార్లకు సరిపడా రైతులకు మెటీరియల్ అందించినట్లు చెబుతున్నా పొలాల్లో బిగించింది 18 వేల హెక్టార్లకే కావడం గమనార్హం. పాతవి పూర్తి చేయాలంటూ రెండు, మూడు నెలలుగా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి ఆదేశాలు ఇస్తున్నా ముందుకు కదలడం లేదు.
బకాయిలతో సమస్య..
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2024–25లో 17,609 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చారు. గతేడాది(2025–26)లో 23,356 హెక్టార్లకు ఇచ్చారు. వీటికి సంబంధించి కంపెనీలకు కంటితుడుగా చెల్లింపులు చేసి రూ.వందల కోట్ల మేర బకాయిలు పెట్టడంతోనే పరికరాల సరఫరాకు మొండికేసినట్లు చెబుతున్నారు. ఆర్థికంగా ఉన్న కొన్ని కంపెనీలు చూద్దాంచేద్దాం అన్నట్లుగా ఉండగా, చాలా డ్రిప్ కంపెనీలు పరికరాల సరఫరాకు ససేమిరా అంటుండటం రైతులకు సమస్యగా మారింది.
దరఖాస్తులు పెరిగే అవకాశం..
ఈ ఏడాది ఎల్–నినో ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యాన తోటలను కాపాడుకోవడం రైతులకు సవాల్‌గా మారింది. వర్షాలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే డ్రిప్ అత్యవసరంగా మారింది. ప్రభుత్వం గతేడాదివే పెండింగ్ పెట్టడంతో ఈ ఏడాది మంజూరుకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే ఆర్‌ఎస్‌కేల్లోనూ, కంపెనీల వద్ద 35 వేల మంది రైతులు డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంజూరైన రైతులకే ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఎన్నడు అందుతాయనేది అంతుచిక్కడం లేదు. కంపెనీలకు బకాయిలు చెల్లిస్తే కాని సూక్ష్మసాగు ముందుకు పడని పరిస్థితి ఉన్నట్లు ఏపీఎంఐపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావొస్తోంది. అయినా, సూక్ష్మసాగు సేద్యానికి ఇంకా మోక్షం లభించలేదు. ఇదిగో అదిగో అంటున్నా ఒక రైతుకు కూడా మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 19 వేల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్ (బిందు, తుంపర) పరికరాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించినా ఇంకా కార్యాచరణ అమలు చేయకపోవడం గమనార్హం.
ఈ ఏడాది 19 వేల హెక్టార్లకు
సూక్ష్మ పరికరాలు ఇస్తామని ప్రకటన
గతేడాది మంజూరు చేసిన రైతులకే
ఇంకా అందని పరికరాలు
డీడీలు చెల్లించిన 5 వేల మంది
రైతుల ఎదురుచూపులు
బకాయిలు పేరుకుపోవడంతో
సరఫరాకు కంపెనీల విముఖత


