నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. అర్జీతో పాటు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap. gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.

నేడు ఎంటీఎస్‌ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్‌ టీచర్లకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్‌ సోమవారం స్థానిక సైన్స్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు 2008 డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్లు, మధ్యాహ్నం 2 గంటలకు 1998 డీఎస్సీ ఎంటీఎస్‌ టీచర్లు హాజరుకావాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో అనధికారికంగా గైర్హాజరు అయినవారు, ఈనెల 12న స్కూల్‌లో జాయిన్‌కాని ఎంటీఎస్‌ టీచర్లకు రెన్యూవల్‌ చేయరని స్పష్టం చేశారు.

రెచ్చిపోయిన

టీడీపీ నాయకులు

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై

కట్టెలతో విచక్షణారహితంగా దాడి

కూడేరు: టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై కట్టెలతో విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండల పరిధిలోని మరుట్ల–1 కాలనీలో మూడు రోజుల క్రితం వైఎస్సార్‌ సీపీ గ్రామ అధ్యక్షుడు దొడ్డప్ప కుమారుడు కౌశిక్‌, టీడీపీ నాయకుడు పవన్‌ కుమారుడు త్రిలోక్‌ గొడవపడ్డారు. త్రిలోక్‌ తన తండ్రిని పిలుచుకొని రావడంతో కౌశిక్‌ను కొట్టి వెళ్లాడు. విషయం దొడ్డప్పకు తెలియడంతో పవన్‌ ఇంటికి వెళ్లి తన కుమారుడిని ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. స్థానికులు సర్దిచెప్పడంతో దొడ్డప్ప వెనక్కి వచ్చాడు. తన ఇంటిపైకి వైఎస్సార్‌ సీపీ నేతలు దాడికి వచ్చారని పవన్‌ పోలీసులను ఆశ్రయించగా.. తన కుమారున్ని కొట్టాడని దొడ్డప్ప ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి పొలంలో నుంచి దొడ్డప్ప,ఆయన అల్లుడు బాలచంద్ర వస్తుండగా టీడీపీ నేతలు పవన్‌, రమేష్‌, నగేష్‌, ప్రసాద్‌, వెంకటేష్‌తో పాటు మరో 10 మంది కర్రలతో దాడికి దిగారు. బాలచంద్ర ఎలాగోలా తప్పించుకుని బయటపడగా, దొడ్డప్పను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు అతన్ని అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలందించారు.

ఎలుగుబంటి హల్‌చల్‌

మడకశిర రూరల్‌: మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సింగేపల్లిలోని బీసీ కాలనీ వద్ద ఎలుగుబంటి హల్‌ చల్‌ చేసింది. ఆదివారం ఉదయం బీసీ కాలనీ వద్దకు వచ్చిన ఎలుగు బంటిని గమనించిన కుక్కలు మొరగడంతో కాలనీ వాసులు చూసి కేకలు వేశారు. దీంతో ఎలుగు పొలాల వైపు పరుగులు తీసింది. రాత్రి సమయంలో బయటికి వెళ్లేందుకు భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని గ్రామం వైపు ఎలుగుబంటి రాకుండా చూడాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement