రాయదుర్గంటౌన్: రాయదుర్గం పట్టణంలో రెండు నెలల నుంచి మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మున్సిపల్ అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. రాయదుర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కన్నీటి కష్టాలు తలెత్తాయి. తాగునీరు సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఎమ్మెల్యే కాలవ ఇంటి ముందు మహిళలు ధర్నా చేశారు. తాజాగా ఆదివారం ఉదయం పట్టణంలోని తహసీల్దార్ రోడ్డు ఏరియా, గోపాలస్వామి గుడి ఏరియా, వంట్లకుంట ఏరియాకు చెందిన మహిళలు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. వన్నూరుస్వామికట్ట బళ్లారి రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించడంతో గంటకుపైగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలనీవాసులకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ నాయకులు నాగార్జున, రవి తదితరులు ఆందోళనలో పాల్గొని అధికారులు, పాలకుల తీరును ఎండగట్టారు. కాలనీల్లో రెండు వారాల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదని, అది కూడా రంగుమారి కలుషిత నీరు వస్తున్నట్లు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి కోసం కాలనీలవాసులు రోడ్డెక్కినా ఇంజినీరింగ్ అధికారులు ఎవరూ రాకపోవడం గమనార్హం. ఫిట్టర్లు, పోలీసులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.
రాయదుర్గంలో మళ్లీ రోడ్డెక్కిన మహిళలు, స్థానికులు


