గార్లదిన్నె: కల్లూరులో 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కంటైనర్‌కు మంటలు రాజుకొని కాలిపోయింది. ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. హర్యానాకు చెందిన తండ్రీ కొడుకులు రియాజ్, అహమ్మద్ కంటైనర్‌ను మహాలక్ష్మి లాజిస్టిక్స్ గూడ్స్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కంటైనర్ వాహనంలో ఫైబర్ నెట్ వస్తువులు, ద్విచక్ర వాహనాల బ్యాటరీలు, మెడిసిన్‌కు సంబంధించిన వస్తువులు బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. తీరా ఘటనాస్థలం కల్లూరు 44వ జాతీయ రహదారిపై వినాయక రైస్‌మిల్ సమీపంలోకి రాగానే వాహనం బ్యాటరీలో అర్త్ కావడంతో పొగలు కమ్ముకున్నాయి. వెనుకలే వెళ్తున్న మరో లారీ డ్రైవర్ గమనించి, వాహనంలో పొగలు వస్తున్నాయని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ రియాజ్ కంటైనర్‌ను రోడ్డు పక్కన ఆపి, తండ్రీ కొడుకులు సురక్షితంగా కిందకు దిగారు. నిమిషాల్లోనే కంటైనర్‌లో మంటలు వ్యాపించి, అందులోని బ్యాటరీలు, ఫైబర్ నెట్ వస్తువులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. స్థానికుల ద్వారా పోలీసులు, ఫైర్ సిబ్బంది సమాచారం అందుకొని ఘటనాస్థలానికి చేరుకొని నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. దాదాపు రూ.15 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


