రైతుల ఆత్మహత్యలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలు పట్టవా?

Jun 21 2026 12:55 AM | Updated on Jun 21 2026 12:55 AM

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్‌ ధ్వజం

పుట్లూరు: సీఎం చంద్రబాబుకు రైతుల ఆత్మహత్యలు పట్టడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు. పుట్లూరు మండలంలోని మడు గుపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కామి శెట్టి చంద్రమోహన్‌ కుటుంబాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ పరామర్శించారు. శనివారం మడుగుపల్లి గ్రామంలో బాధిత రైతు ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి భార్య శాంతి, కుమార్తె సంధ్య, కుమారుడు అభికుమార్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు.

చంద్రబాబుకు రైతుల ఆత్మఘోస పట్టదా..? : శైలజానాథ్‌ మాట్లాడుతూ జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 రైతు ఆత్మహత్యలు జరిగాయని, ఈ ఆత్మహత్యలు వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రైతుల ఆత్మగోషలను తెలుసుకోవాలని హితవు పలికారు. కామిశెట్టి చంద్రమోహన్‌ అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు ప్రభుత్వం తరఫున అధికారులు కూడా పట్టించుకోలేదన్నారు.అనంతరం రెవెన్యూ, వ్యవసాయ అధికారులను ఫోన్‌ ద్వారా సంప్రదించి, బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు, వర్షాభావ పరిస్థితులు, ధరల లేమి, పెట్టుబడుల భారం, తెగుళ్ల బెడదతో రైతులు ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నారన్నారు. రైతులు నష్టపోయిన సమయంలో వెంటనే పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

తల్లీ.. నీబిడ్డ చదువు మధ్యలో

ఆగిపోనివ్వనమ్మా.. :

తల్లీ.. నీ బిడ్డ చదువు ఆగిపోనివ్వనమ్మా.. రెండేళ్లపాటు కాలేజీ ఫీజు చెల్లిస్తాను.. ధైర్యంగా ఉండాలని బాధితురాలికి శైలజానాథ్‌ భరోసా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కామిశెట్టి చంద్రమోహన్‌ కుమార్తె సంధ్య డిప్లమో చదువుతుండగా కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉందని తెలుసుకున్న ఆయన.. చదువు మధ్యలో ఆగిపోకుండా రెండేళ్ల ఫీజు తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. మండల కన్వీనర్‌ పొన్నపాటి మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సువర్ణ, పలు విభాగాల నాయకులు వంశీగోకుల్‌రెడ్డి, మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, శేఖర్‌, కాటమయ్య, సురేష్‌, మధుసూదన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement