అనంతపురం క్రైం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని వీకే భవన్‌లో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ఉద్యమ సన్నాహక సదస్సులో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, జి.వి.నరసయ్య, కోకన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, సి.సుందరయ్య, ఎం.పురుషోత్తం పాల్గొన్నారు. సమావేశానికి జోనల్ కార్యదర్శి ఎం.చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన వారిలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న భారీ రాయితీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నారని విమర్శించారు. జి.వి.నరసయ్య మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా కొత్త బస్సులు, సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 12 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రతి నెల సుమారు 250 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నా నియామకాలు చేపట్టలేదన్నారు. నెల్లూరు–2, గుంటూరు–2, విద్యాధరపురం డిపోలను తిరిగి ప్రారంభించాలని, మంగళం డిపోను ఖాళీ చేయించే చర్యలను నిలిపివేయాలని కోరారు. శక్తి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన రీయింబర్స్‌మెంట్ నిధులను పూర్తిగా విడుదల చేయాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.
23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు:
ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందన లేకపోతే ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, గేట్ మీటింగ్‌లు, ధర్నాలు నిర్వహిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరికలు చేశారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన రాష్ట్ర, జోనల్, జిల్లా, రీజియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు, డిపో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి


