అటకెక్కిన ‘పెరటి తోటలు’ | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ‘పెరటి తోటలు’

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

తాడిపత్రి రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల వద్ద చేపట్టిన పెరటి తోటల పెంపకం అధికారుల పర్యవేక్షణ లోపంతో అటకెక్కింది. చిన్నారుల్లో రక్తహీనత, పోషణ లోపాలను సరిదిద్దేందుకు వారికి అందించే ఆహారం పోషకాలతో నిండి ఉండాలన్న లక్ష్యంతో న్యూట్రీ కిచెన్‌ గార్డెన్‌ పేరిట పెరటి తోటల పెంపకానికి సీ్త్ర శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సొంత భవనాలు కలిగిన 339 అంగన్‌వాడీ కేంద్రాలను పెరటి తోటల పెంపకానికి ఎంపిక చేశారు. ఇందులో అనంతపురం జిల్లాలో 185 కేంద్రాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 154 కేంద్రాలు ఉన్నాయి. గత ఏడాది రూ.33.90 లక్షల నిధులు విడుదల చేసి.. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.10 వేల చొప్పున అంగన్‌వాడీ టీచర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల వద్ద గోరుచిక్కుడు, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు, గోంగూర, మెంతికూర, పాలకూర, చుక్కాకు, కొత్తిమీర, తదితర వాటిని పండించాలని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను అదేశించింది. అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ అందించింది. అయితే కొద్ది రోజులకే అనేకచోట్ల సంరక్షణ కరువైంది. పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, వీధి కుక్కలు చొరబడి మొక్కలను నాశనం చేశాయి. మరికొన్ని చోట్ల నీటి సౌకర్యం లేక మొక్కలు దెబ్బతిన్నాయి. అధికారులు కూడా పర్యవేక్షణను గాలికొదిలేశారు. పెరటి తోటలు కనుమరగవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరకుండా పోయింది.

పెరిగిన పనిభారం

అంగన్‌వాడీ వర్కర్లు ఉదయం నుంచి రాత్రి వరకు యాప్‌లతో కుస్తీ పడుతున్నారు. సర్వేలు, ప్రాజెక్టు మీటింగ్‌లు, సెక్టార్‌ సమావేఽశాలు తదితర వాటితో పనిభారం విపరీతంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పెరటి తోటల పెంపకం మరింత భారంగా పరిణమిందని పలువురు అంగన్‌వాడీ వర్కర్లు వాపోయారు.

ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణ లోపం

అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ధ్వంసమైన మొక్కలు

ఇదీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో న్యూట్రీ కిచెన్‌ గార్డెన్‌ల దుస్థితి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement