దగా చేసినందుకు సంబరాలా..? | - | Sakshi
Sakshi News home page

దగా చేసినందుకు సంబరాలా..?

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

కూటమి పార్టీలపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం

అనంతపురం: హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ దగా చేసినందుకు కూటమి పార్టీలు విజయోత్సవాలు నిర్వహించాయా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి హామీలను విస్మరించి నయవంచన చేశామనే ఆనందంలో సంబరాలు చేశారా అని ఎద్దేవా చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత మాట్లాడారు. అనంతపురంలో విజయోత్సవం పేరుతో నిర్వహించినది నయవంచన సభ అంటూ విమర్శించారు. ఏకంగా కలెక్టర్‌ను కూడా టీడీపీ కార్యకర్తలా మార్చేశారని విరు చుకుపడ్డారు. వేదికపై కలెక్టర్‌ సమక్షంలోనే రాజకీయ ఉపన్యాసాలు చేయించి.. హోదాను తగ్గించారన్నారు.

ఫించన్లలోనూ కోత

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో 66 లక్షల మంది సామాజిక భద్రత పింఛన్‌ అందుకునే వారని గుర్తు చేశారు. రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయకపోగా.. ఉన్నవాటిలో 6 లక్షల పింఛన్లు తొలగించినందుకు విజయోత్సవ సభ నిర్వహించారా అని అనంత విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లోని నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఎక్కడ? ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.1500 ఏదీ? అంటూ నిలదీశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతులకు రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేంద్రంతో ముడిపెట్టారని.. పైగా తొలి ఏడాది ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అందించలేదని మండిపడ్డారు. రెండో ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టారని విరుచుకుపడ్డారు.

హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌లో అవినీతి

హంద్రీ–నీవా తొలి దశ కాలువ వెడల్పు అనుకున్న స్థాయిలో చేయలేదని, రెండో దశ లైనింగ్‌ పనుల్లో అవినీతి పెరిగిపోవడంతో నాణ్యత లేకుండాపోయిందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. చంద్రబాబు మాత్రం ఎలక్ట్రిక్‌ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులనూ అమ్మకానికి పెడుతోందన్నారు. డైవర్షన్‌ పాటిటిక్స్‌లో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని విమర్శించారు. డీఎస్సీ కుంభకోణం, విజయవాడలో సాయికృష్ణ లాకప్‌ డెత్‌, దళితుడు క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటనలను డైవర్ట్‌ చేయడానికి ప్రభుత్వం సునీల్‌ను అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని తెలిపారు.

అక్రమాల పుట్టగా డీఎస్సీ నియామకాలు

చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ నియామకాలను అక్రమాలకు నిలయంగా మార్చిందని అనంత ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒకే నోటిఫికేషన్‌తో సచివాలయాల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా రాలేదని గుర్తు చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించిన తీరును అర్థం చేసుకోవాలన్నారు. ఏ ఎండకా గొడుగు పట్టుకునే నైజం ఉన్న వారిని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యరద్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు కేశవరెడ్డి, యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి మసూద్‌, సోషల్‌ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement